ఆటలకు వేళాయే..!

by velandi.Saikiran |

వేసవి రాకతో నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్సులు , క్రీడా మైదానాలు చిన్నారుల ఉత్సాహంతో నిండిపోతున్నాయి.

ఆటలకు వేళాయే..!
X

ఆటలకు వేళాయే..!

వేసవి క్రీడల సందడి షురూ..

- సెలవులతో క్రీడల జోష్

- భావి క్రీడాకారులతో కళకళలాడుతున్న మైదానాలు

దిశ, ఖైరతాబాద్ : వేసవి రాకతో నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్సులు , క్రీడా మైదానాలు చిన్నారుల ఉత్సాహంతో నిండిపోతున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రారంభం కావడంతో పిల్లలు తమకు ఇష్టమైన క్రీడల్లో శిక్షణ మొదలుపెట్టడం విశేషం. ఈసారి జీహెచ్ఎంసీ వేసవి శిబిరాలపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, క్రీడా ప్రాంగణాల్లో మాత్రం ఆటల పండుగ మొదలైంది.

ఇండోర్ – అవుట్‌డోర్ గేమ్స్‌కు స్పందన..

సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ గురుగోబింద్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో చిన్నారుల సందడి ఊపందుకుంది. ముఖ్యంగా సనత్‌నగర్ ప్రాంతంలో ప్రతి క్రీడకు ప్రత్యేక గ్రౌండ్ ఉండడం విశేషం. నగరంలో అరుదుగా కనిపించేలా ఒకే ప్రాంతంలో అన్ని రకాల క్రీడలకు సంబంధించిన సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, యోగా, కరాటే, హ్యాండ్‌బాల్, క్రికెట్, హాకీ, స్కేటింగ్, జిమ్ వంటి అనేక క్రీడలకు శిక్షణ అందిస్తున్నారు. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్ రెండింటికీ సమాన ప్రాధాన్యత ఉండడంతో పిల్లలు తమ ఆసక్తికి అనుగుణంగా క్రీడలను ఎంపిక చేసుకుంటున్నారు.

క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని..పిల్లల్లో శారీరక దృఢత్వం పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయనే నమ్మకంతో తల్లిదండ్రులు కూడా క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్, టీవీ ప్రభావం తగ్గించేందుకు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆటలకు కేటాయించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే క్రీడా ప్రాంగణాలు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. చెమటోడ్చుతూ ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలు, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు ఇలా.. వాతావరణమంతా క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది.

భావి క్రీడాకారులకు బలమైన పునాది

మొత్తానికి వేసవి కాలం చిన్నారులకు కేవలం సెలవుల సమయం మాత్రమే కాదు.. వారి భవిష్యత్తుకు పునాది వేసే సువర్ణావకాశంగా మారింది. సనత్‌నగర్ వంటి క్రీడా కేంద్రాలు భావి క్రీడాకారులను తయారు చేసే గుణశాలలుగా నిలుస్తున్నాయి. క్రీడలపై ఆసక్తి, పట్టుదల, సరైన శిక్షణ ఉంటే.. ఈ మైదానాల నుంచే రేపటి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వెలుగులోకి రావడం ఖాయం అవుతుంది పలువురు అభిప్రాయపడుతున్నారు.

స్విమ్మింగ్‌కు భారీ డిమాండ్..

వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం స్విమ్మింగ్ పూల్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగింది. సనత్‌నగర్ స్విమ్మింగ్ పూల్‌లో ఇప్పటికే బ్యాచ్‌ల వారీగా శిక్షణ ప్రారంభమైంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే అన్ని బ్యాచ్‌లు ఫుల్ కావడం ఇక్కడి ఆదరణను తెలుపుతున్నది.

కోచ్‌ల ప్రోత్సాహం.. ప్రతిభకు పదును..

చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి కోచ్‌లు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేయడానికి అవసరమైన టెక్నిక్స్ నేర్పుతూ వారిని రాటుదేలేలా చేస్తున్నారు. జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగిన వారిలో చాలామంది తమ ప్రయాణాన్ని ఇలాంటి వేసవి శిబిరాల నుంచే ప్రారంభించారని కోచ్‌లు చెబుతూ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు.

క్రికెట్ కు మంచి స్పందన

2004లో సనత్ నగర్ క్రికెట్ అకాడమీనీ తన తండ్రి ధనరాజ్ బాబు ప్రారంభించారు. 15 ఏండ్ల అనుభవంతో క్రికెట్ హెడ్ కోచ్గా ప్రస్తుతం సనత్ నగర్ గ్రౌండ్ లో శిక్షణ ఇస్తున్నారు. ఆయన వద్ద శిక్షణ పొందినవారిలో ఒకరు అండర్19 టీం ఇండియన్ జట్టుకు అడగా, ఐపీఎల్ లో ఇద్దరు మహిళలు ఆడారు. 10 మందికి పైగా రాష్ట్రస్థాయిలో ఆడారు. పిల్లల క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేలా శిక్షణతోపాటు ప్రత్యేక మ్యాప్ పెయింటింగ్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మహిళా టీం ఇండియా అండర్ 19 జట్టు కోచులు షాలిని మంత్రావడి, నూషిన్ అల్ ఖదీర్ టిప్స్ ఇచ్చేందుకు వస్తుంటారు. ముఖ్యంగా సనత్ నగర్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో ఉత్సాహంగా క్రీడల్లో బాలబాలికలు పాల్గొంటున్నారు. ఎక్కువ మంది క్రికెట్ శిక్షణలో ఆసక్తి చూపుతున్నారు.

- రాజ్ కిరణ్, : సనత్ నగర్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్

Next Story