- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దోమలు.. బాబోయ్..
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం, బైరమల్ గూడ, బీఎన్ రెడ్డి నగర్, సాహెబ్ నగర్ డివిజన్లలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.

దిశ, హస్తినాపురం: ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం, బైరమల్ గూడ, బీఎన్ రెడ్డి నగర్, సాహెబ్ నగర్ డివిజన్లలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజల సాధారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎటు చూసినా దోమల బెడదతో కాలనీల్లో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శుభ్రత, పారిశుధ్య నిర్వహణపై బాధ్యత వహించాల్సిన అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రజల ఆరోగ్యానికే ముప్పుగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎక్కడ చూసినా చెత్త గుట్టలే..
ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలు దాటిందంటే ఇళ్ల బయట నిలబడలేని పరిస్థితి నెలకొంటున్నది. కొద్దిసేపు బయటికి వచ్చినా దోమల కాటుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి డోర్లు, కిటికీలు తెరిచి మరిచితే చాలు.. దోమల దాడి మొదలవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఫలితంగా రాత్రి వేళల్లో నిద్ర లేని పరిస్థితి, పగటి వేళల్లో అలసటతో పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దోమల బెడదతో ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. దోమల కాటుతో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్లు వ్యాప్తి చెందుతున్నాయన్న భయం ప్రజలను వెంటాడుతున్నది. ఇప్పటికే అనేక కుటుంబాలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, మందులు, చికిత్సల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతున్నది.
పారిశుధ్య లోపమే కారణం..
కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడం, మురుగు నీరు నిలిచిపోవడం, చెత్త ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో దోమల పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాలు తగ్గినా డ్రైనేజీల్లో నీరు నిలిచి ఉండడంతో దోమలు మరింత పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఎక్కడ జీహెచ్ఎంసీ పర్యవేక్షణ?
దోమల నివారణలో కీలక పాత్ర పోషించాల్సిన జిహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో కనిపించడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గల్లీలు, బస్తీల్లో 1 నెల. రోజులకోసారి కూడా ఫాగింగ్ చేయని పరిస్థితి నెలకొంది. దోమల మందు స్ప్రే, లార్వా నియంత్రణ చర్యలు ఎక్కడా కనిపించడంలేదని అంటున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే వారు అందుబాటులో ఉండకపోవడం మరో పెద్ద సమస్యగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం వల్ల ప్రజలకు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి
దోమల కాటుతో ప్రజలు పడుతున్న అవస్థలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి నిరంతర ఫాగింగ్, దోమల మందు స్ప్రే, లార్వా నివారణ, డ్రైనేజీ శుద్ధి చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాలనీల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమై ప్రజారోగ్య సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.






