- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్ముల్ ‘బందీ’?
తెలంగాణ ప్రాంతంలోనే ఓ వెలుగు వెలిగిన నాటి ‘మదర్ డెయిరీ’.. నేటి ఉమ్మడి నల్గొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) డెయిరీని ఉద్దేశపూర్వకంగానే నష్టాల ఊబిలో ముంచుతున్నారని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నార్ముల్ ‘బందీ’?
– అప్పుల ఊబిలో మదర్ డెయిరీ
– నెలల తరబడి పాల బిల్లులు, జీతాలు లేవ్..
– 32 వేల మంది పాడి రైతులకు శఠగోపం
– అదృశ్య శక్తి మాయలో ప్రాభవం కనుమరుగు
– ఆయన గుత్తాధిపత్యంతోనే డెయిరీ ప్రశ్నార్థకం
– బోర్డు డైరెక్టర్లు కూడా ఆయన గుప్పిట్లోనే..
– గట్టెక్కించే పనిలో ఉన్న చైర్మన్ కు అవిశ్వాస సెగలు
– నోటీసులు అందలేదు : చైర్మన్ మధుసూదన్ రెడ్డి
– నేడు నార్ముల్ పాలకవర్గం సమావేశం జరిగేనా?
దిశ, వనస్థలిపురం: తెలంగాణ ప్రాంతంలోనే ఓ వెలుగు వెలిగిన నాటి ‘మదర్ డెయిరీ’.. నేటి ఉమ్మడి నల్గొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) డెయిరీని ఉద్దేశపూర్వకంగానే నష్టాల ఊబిలో ముంచుతున్నారని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారం, అవినీతే లక్ష్యంగా ఉన్నత స్థానంలో తిష్ట వేసిన ఓ అదృశ్య శక్తి కొన్నేండ్లుగా గుత్తాధిపత్యంతో బందీ చేసి డెయిరీ ప్రాభవాన్ని కోల్పోయేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన సదరు అదృశ్య శక్తి అవినీతి హవాలో ‘నార్ముల్’ డైరెక్టర్లు కూడా డమ్మీలుగా మారి కీలుబొమ్మలయ్యారే తప్పా డెయిరీ డెవలప్మెంట్ కు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో రైతులకు, వర్కర్లకు అప్పుల తిప్పలు.. వారికి ఆస్తుల చిట్టాలు పెరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్ముల్ ను అప్పుల బాధల నుంచి గట్టెక్కించేందుకు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)కి అప్పగించడమే శరణ్యమని భావించి అడుగులేస్తున్న చైర్మన్‌ను కుర్చీ నుంచి దించడమే లక్ష్యంగా సదరు అదృశ్య శక్తి అవిశ్వాసానికి ఉసికొల్పి నోటీసులు ఇప్పించినట్లు తెలుస్తోంది. నోటీసుల నేపథ్యంలో నేడు (సోమవారం) పాలకవర్గ సమావేశం జరుగుతుందా? లేదా అన్న చర్చ జోరుగా సాగుతున్నది.
పాడి రైతుల ఆందోళనలు, వర్కర్ల ఆత్మహత్యలు..
‘నార్ముల్’ దాదాపు 40 ఏండ్లుగా పాడి రైతులకు ఆసరాగా నిలుస్తున్నది. దీని పరిధిలో సుమారు 32వేల మంది పాడి రైతులు 432 సొసైటీల ద్వారా.. రోజుకు 60 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. సంస్థలో దాదాపు 500 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైతులకు 8 పాల బిల్లులు, వర్కర్లకు జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారు పాల క్యాన్లతో రోడ్డెక్కుతూ.. ఆందోళనకు దిగుతుండగా.. వర్కర్లు మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి నార్ముల్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మదర్ డెయిరీ మాతృసంస్థ అయిన ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకుంటామని, అదొక్కటే మార్గమంటూ చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఆ చర్యలు స్పీడప్ చేశారు.
ఎండీకి నోటీసులు అందజేసిన డైరెక్టర్లు..
ఎండీడీబీకి అప్పగిస్తే.. రైతులకు మేలు జరుగుతుందే తప్పా.. తమకు ప్రాధాన్యం తగ్గుతుందని భావించిన కొందరు డైరెక్టర్లు.. ఆ ప్రక్రియను ఆపాలంటే.. చైర్మన్ నే కుర్చీ నుంచి దింపేయాలని పావులు కదిపినట్లు తెలిసింది. పాలసేకరణ తగ్గిందని, రైతులు ఇతర డెయిరీలకు పాలు పోస్తున్నారని దీనిపై చర్చించాలని డిసెంబర్ 31న ఎమర్జెన్సీ మీటింగ్ కోసం ఎండీ కృష్ణకు నోటీసు ఇచ్చారు. దీనిపై చైర్మన్ స్పందించకపోవడంతో ఇక అవిశ్వాసమే లక్ష్యంగా 11 మంది డైరెక్టర్లు ఎండీతో సమావేశమై చర్చించి నోటీసులు అందజేశారు.
గత పాలకుల హయాంలోనే ఆగమాగం..
నార్ముల్ గత పదేండ్ల కింద ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. డెయిరీ లాభాల్లోనే నడిచింది. కరోనా సమయంలో రూ.16 కోట్ల అప్పులు అయ్యాయి. దీని నుంచి గట్టెక్కే సమయంలో డెయిరీలో బీఆర్ఎస్ నాయకుల ఎంట్రీ, ఎండీ అలసత్వంతో డెయిరీ ఆగమాగమైంది. 2023 వరకు కూడా.. రూ.16 కోట్ల అప్పులు ఉండగా.. ప్రస్తుతం రూ. 70 కోట్లకు చేరింది. పాడి సంపదతో సంబంధం లేని వాళ్లు కూడా.. రాజకీయ పదవులుగా భావించి పైసలు పెట్టి పదవుల్లోకి రావడంతో .. డైరెక్టర్లు, మేనేజర్లు అంతా మిలాఖత్ అయి కేవలం సొంత సంపాదనపైనే ఫోకస్ పెట్టారు. దీనిలో ఎండీ స్థాయి అధికారుల గుత్తాధిపత్యంతో డెయిరీ ఆస్తులు అమ్మేందుకు కూడా కుట్రలు చేశారు.
నోటీసులు అందలేదు: చైర్మన్ మధుసూదన్ రెడ్డి
అవిశ్వాసం ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా ఎండీ సృష్టించిన సమస్య. ఎండీడీబీతో ఒప్పందం చేసుకొని నార్ముల్ ను గట్టెక్కించాలని కొంత కాలంగా ప్రయత్నం చేస్తున్నా. కానీ గత పదేండ్ల కాలంలో పాలకవర్గాలు, ఎండీలు తప్పుడు లెక్కలు చేసి బ్యాంకుకు ఇచ్చిన్రో.. ఇప్పుడు ఆ లెక్కలన్నీ తప్పులు అని తేలడంతో బ్యాంకు అధికారులు మీ వద్ద స్టాక్ లేకున్నా.. మా ఫండ్స్ అన్నీ ఎలా వాడుకుంటారు? ఎక్కడ డైవర్ట్ చేశారు. మేము నార్ముల్ కు ఎందుకు లాక్ అవుట్ చేయొద్దు చెప్పండి అని నిలదీశారు. అప్పటి నుంచి నేను ఆయన చేసిన అవినీతిపై నిలదీశాను. దాంతో నామీద అవినీతి ఆరోపణలు చేశారు. దీనికి ఎండీనే కుట్ర చేశారు. ఇప్పటికీ నెల్లూరు విజయ వాళ్లు నార్ముల్ కు రూ.70 లక్షలు బాకీ ఉన్నారు. అది వసూలు చేయడంలో ఎండీ విఫలమయ్యారు. ఇప్పటి వరకు నాకు నోటీసులు అందలేదు. అయినా.. మా సంస్థ బైలాస్ లో అవిశ్వాసానికి తావు లేదు. నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నా.. ఏవైనా ఎదుర్కొంటా.






