ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌లో టెస్టులు లేవ్?

by velandi.Saikiran |   (  Updated:2025-12-11 21:45:51  IST  )

ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌లో టెస్టులు లేవ్?
X

ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌లో టెస్టులు లేవ్?

నెలరోజులుగా పనిచేయని కీలక వైద్య పరికరాలు

పేద రోగులకు తీవ్ర ఇబ్బందులు

సిటీ స్కాన్, రేడియేషన్ సేవలు నిలిచిపోవడంతో బయట ల్యాబ్‌లకు రెఫర్

పరిస్థితులను హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లిన మానవహక్కుల న్యాయవాది రామారావు

దిశ , హైదరాబాద్ బ్యూరో: క్యాన్సర్ వ్యాధి బారిన పడిన రోగుల పాలిట ధర్మాస్పత్రిగా గుర్తింపు పొందిన ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ ఆస్పత్రిలో పరికరాల కొరతతో రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. సుమారు నెల రోజులుగా రేడియేషన్, రేడియో థెరెఫి, అంకాలజీ పరికరాలు పని చేయడం లేదు. ఐవీ కాంట్రాక్ట్ లిక్విడ్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో సీటీ స్కాన్ సేవలు నిలిచిపోయాయి.

ఈ హాస్పిటల్‌ను సుమారు 70 యేండ్ల క్రితం 1955, డిసెంబర్ 8న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. నాటి నుంచి ఈ ఆస్పత్రిలో క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడికి కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రోగులు వైద్య సేవల కోసం వస్తున్నారు. సుమారు 800 మంది రోగులు ప్రతినిత్యం ఓపీ విభాగానికి వస్తుంటారు. హాస్పిటల్ ప్రారంభంలో 40 పడకలు ఏర్పాటు చేయగా.. ఇప్పుడు 750 పడకల సామర్థ్యానికి చేరుకుంది.

రోగుల రద్దీ..

క్యాన్సర్ రోగులకు స్పెషలిస్ట్ హాస్పిటల్‌గా గుర్తింపు పొందిన ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో వైద్యం కోసం ప్రతినిత్యం వందలాది మంది రోగులు వైద్య సేవల కోసం వస్తుంటారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరం ఉన్న వారిని ఇన్ పేషంట్లుగా చేర్చుకొని వైద్య సేవలు అందిస్తుంటారు. ఇలా వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాలు చెడిపోవడం, తరచుగా మొరాయించడం జరుగుతుండడంతో టెస్టుల కోసం బయటకు రెఫర్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే రోగుల్లో అధిక శాతం పేదలే ఉంటుండడం, వారికి బయటి ల్యాబ్‌లలో వేలాది రూపాయలు వెచ్చించి టెస్టులు చేయించుకునే స్థోమత లేకపోవడంతో వారు పడరాని పాట్లు పడుతున్నారు. సుమారు నెలరోజులుగా యంత్రాలు పని చేయకున్నా ఆస్పత్రి అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం వినబడుతున్నాయి. దీనికితోడు సిబ్బంది కొరత కూడా పట్టి పీడిస్తోంది. రోగుల రద్దీకి తగ్గట్లుగా వైద్యులు లేకపోవడంతో పని చేస్తున్న వారిపై భారం పడుతున్నది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాస్పిటల్‌లో చెడిపోయిన వైద్య పరికరాలకు వెంటనే మరమ్మతులు చేయించడంతో పాటు అవసరాల మేరకు సిబ్బందిని నియమించి రోగుల ఇబ్బందులు తొలగించాలని అభిప్రాయాలు వినబడుతున్నాయి.

హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన న్యాయవాది..

ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో యంత్రాలు చెడిపోయి రోగులు పడుతున్న ఇబ్బందులపై ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. యంత్రాలు చెడిపోయి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన హెచ్ఆర్సీ దృష్టికి తీసుకువచ్చారు .ఏడు దశాబ్దాల చరిత్ర గల హాస్పిటల్ లో రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని, వారికి మరింతగా ప్రమాదం కల్గించేలా పరిస్థితులు ఉన్నాయని, హెచ్ఆర్సీ ఈ విషయంలో జోక్యం చేసుకుని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టేలా ఉన్నతాధికారులను ఆదేశించాలని కోరారు .

Next Story