- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ మార్కెట్‌కు సిలిండర్..ఒక్కోటి రూ.2,800లపైనే !
ప్రస్తుతం మార్కెట్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అధికారిక ధర సుమారు రూ.950 ఉంది. కానీ, డీలర్లు ‘స్టాక్ లేదు’ అనే సాకుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

‘గ్యాస్’ గండం
బ్లాక్ మార్కెట్‌కు సిలిండర్
- వంటగదిపై యుద్ధ ప్రభావం
- ఆకాశాన్ని తాకిన ధర
- డీలర్ల కృత్రిమ కొరత
- ఉగాది, రంజాన్‌కు తప్పని తిప్పలు
- ఇండక్షన్ స్టవ్‌ల వైపు మళ్లుతున్న మధ్యతరగతి ప్రజలు
అంతర్జాతీయ యుద్ధ మేఘాలు సామాన్యుడి వంటగదిని అతలాకుతలం చేస్తున్నాయి. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తున్నది. యుద్ధం పేరు చెప్పి గ్యాస్ డీలర్లు సాగిస్తున్న అక్రమ దందా ఇప్పుడు వినియోగదారులకు శాపంగా మారింది. ముఖ్యంగా సికింద్రాబాద్ వంటి నగర ప్రాంతాల్లో డీలర్లు కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తూ, గ్యాస్ సిలిండర్లను యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.
దిశ, సికింద్రాబాద్: సామాన్యుడికి వంటగ్యాస్ కష్టాలు తప్పడం లేదు. అంతర్జాతీయ యుద్ధం ప్రభావం వంట గ్యాస్ పై పడింది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న డీలర్లు కొరత సాకుతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో సిలిండర్ బుక్ చేసినా బండ దొరకాలంటే దాని కోసం నానా తిప్పలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
బ్లాక్‌లో మూడు రేట్లు అదనంగా విక్రయం..
ప్రస్తుతం మార్కెట్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అధికారిక ధర సుమారు రూ.950 ఉంది. కానీ, డీలర్లు ‘స్టాక్ లేదు’ అనే సాకుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదే సమయంలో అదనపు డబ్బులు చెల్లించే వారికి మాత్రం గుట్టుచప్పుడు కాకుండా సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా రూ.900లకు రావాల్సిన సిలిండర్, బ్లాక్ మార్కెట్‌లో డీలర్ల ఇష్టానుసారంగా రూ.1,800 నుంచి రూ.2,800 రూపాయల వరకు పలుకుతున్నది. వినియోగదారుల అసహాయతను పెట్టుబడిగా మార్చుకొని డీలర్లు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
పండుగ పూట గ్యాస్ కష్టాలు..
రానున్న మూడు రోజుల్లో వరుస పండుగలున్నాయి. గురువారం ఉగాది, ఆ తర్వాత రంజాన్ వంటి పండుగలు వస్తుండడంతో గ్యాస్ బండ దొరుకుందో లేదోనని ప్రజల్లో ఆందోళన మొదలైంది. పండుగ పూట పిండివంటలు, ప్రత్యేక భోజనాల తయారీకి గ్యాస్ వినియోగం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయాన్నే డీలర్లు తమ లాభాల కోసం వాడుకుంటున్నారు. ‘పండుగకు గ్యాస్ దొరుకుతుందో లేదో’ అన్న భయంతో ప్రజలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లోపించడం వల్లే డీలర్లు ఇంతలా రెచ్చిపోతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండక్షన్ స్టవ్ వైపు ప్రజల చూపు..
ఈ గ్యాస్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం డీలర్ల చుట్టూ తిరగలేక, బ్లాక్ మార్కెట్‌లో వేల రూపాయలు పోయలేక ఇండక్షన్ స్టవ్‌లే మేలని భావిస్తున్నారు. దీనివల్ల ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో ఇండక్షన్ స్టవ్‌లకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరిగింది. అమ్మకాలు పెరగడంతో వీటి ధరలు కూడా క్రమంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్ దొరకని పక్షంలో కనీసం కరెంట్‌తోనైనా వంట చేసుకోవచ్చన్న ఆలోచనతో మధ్యతరగతి ప్రజలు ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నారు.






