లాలాగూడ క్యారేజ్ వర్క్‌షాప్‌ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్

by Kodari Anjali |

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం లాలాగూడ క్యారేజ్ వర్క్‌షాప్‌ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు.

లాలాగూడ క్యారేజ్ వర్క్‌షాప్‌ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
X

దిశ, సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం లాలాగూడ క్యారేజ్ వర్క్‌షాప్‌ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్క్‌షాప్‌లో జరుగుతున్న కోచ్‌ల నిర్వహణ, మరమ్మతు పనులను పరిశీలించారు. వర్క్‌షాప్ చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ జి.సుమన జనరల్ మేనేజర్‌కు వర్క్‌షాప్ పనితీరు, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ విధానాలపై వివరించారు. వర్క్‌షాప్‌లో సిబ్బంది పాటిస్తున్న భద్రతా విధానాలు, ఆధునిక పరికరాల వినియోగం, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌బీ వర్క్ స్టేషన్/మానిప్యులేటర్, డైనమిక్ వీల్ బ్యాలెన్సింగ్ మెషిన్, షాక్ అబ్జార్బర్ టెస్టింగ్ మెషిన్, ఎయిర్ బ్రేక్ సబ్ స్టోర్స్, న్యూ ట్రిమ్మింగ్ షాప్, ఆప్టికల్ ఎమిషన్ స్పెక్ట్రోమీటర్, యూనివర్సల్ టెస్టింగ్ మెషిన్ వంటి ఆధునిక పరికరాలను పరిశీలించారు. వర్క్‌షాప్‌లో నిర్వహిస్తున్న పనుల నాణ్యతపై జనరల్ మేనేజర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ సిబ్బంది తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్న తీరు ప్రశంసనీయమని సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. అలాగే వర్క్‌షాప్‌ను స్క్రాప్ రహిత యూనిట్‌గా నిర్వహిస్తూ పచ్చదనాన్ని కాపాడుతున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు.

Next Story