శంషాబాద్ విమానాశ్రయంలో సరికొత్త దోపిడీ.. జాగ్రత్త!

by Web Desk |
శంషాబాద్ విమానాశ్రయంలో సరికొత్త దోపిడీ.. జాగ్రత్త!
X

కరోనా టెస్టులు ఆ సంస్థకు కాసులు కురిపిస్తున్నాయి. విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వాళ్లే టార్గెట్ గా ఈ దందా కొనసాగుతున్నది. యథేచ్ఛగా భారీ స్కాం జరుగుతున్నా అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదు. విదేశాల నుంచి శంషాబాద్​కు వస్తున్నవారి నుంచి రూ. 3,400 చొప్పన వసూలు చేస్తున్న మ్యాప్ మై జీనోమ్ సంస్థ పరీక్షలే చేయడం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్​పత్రాలు తీసుకోని ఇళ్లకు పంపుతున్నది. స్వస్థలాలకు చేరుకోవాలన్న ఎన్ఆర్ఐల ఆత్రుతను ఇలా సొమ్ము చేసుకొంటున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో సరికొత్త దోపిడీ మొదలైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు టెస్టులు చేయకుండానే ఛార్జీల పేరుతో డబ్బులు నొక్కేస్తున్నది 'మ్యాప్ మై జినోమ్'అనే ప్రైవేటు లాబ్. ప్రయాణికులు దిగగానే వారి నుంచి డిజిటల్ రూపంలో రాపిడ్ పీసీఆర్ టెస్టు కోసం రూ. 2,900, రెగ్యులర్ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు కోసం రూ. 500 వసూలు చేస్తున్నది. కానీ వారి నుంచి శాంపిళ్లు తీసుకోవడంలేదు. టెస్టులూ చేయడంలేదు. మొబైల్ నెంబర్‌కు రిపోర్టునూ పంపడంలేదు. చాలా కాలం తర్వాత స్వదేశానికి వచ్చి సొంతూరికి వెళ్లి పోదామనే ఆలోచనతో డబ్బులు కట్టినా శాంపిల్ ఎందుకు తీసుకోలేదు, టెస్టు ఎందుకు చేయలేదు, రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు అని ప్రయాణికులు అడగడం లేదు. ఈ పరిస్థితే ఆ ప్రైవేటు ల్యాబ్ కు వరంగా మారింది. దోపిడీకి మార్గాన్ని సుగమం చేసింది.

తాజాగా ఈ నెల 14న అమెరికా నుంచి లండన్ మీదుగా ఎనిమిది మంది ప్రయాణికుల వద్ద తలా రూ. 3,400 చొప్పున రాపిడ్ పీసీఆర్, రెగ్యులర్ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల కోసమంటూ విడివిడిగా ఆన్ లైన్ లో డబ్బులు కట్టించుకున్నది. డబ్బులు చెల్లించినట్లు డిజిటల్ రసీదును చూపించిన తర్వాతనే విమానం ఎక్కేందుకు అనుమతి ఇచ్చింది. వీరంతా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత దాదాపు రెండు గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే శాంపిల్ ఇవ్వడం కోసం వెయిట్ చేశారు. డిజిటల్ పద్ధతిలో పేమెంట్ చేసిన తర్వాత శాంపిల్ త్వరగా తీసుకోవాలంటూ ల్యాబ్ సిబ్బందిని కోరారు. కొద్దిసేపు వేచి ఉండాలంటూ చెప్పి ఇక శాంపిల్ అవసరం లేదంటూ పంపించేశారు. కానీ 'సెల్ఫ్ డిక్లరేషన్'పై మాత్రం సంతకం తీసుకున్నారు. 'మాకు కరోనాను పోలిన ఏ లక్షణాలూ లేవు' అంటూ ఆ సెల్ఫ్ డిక్లరేషన్‌ ఇచ్చి ఇంటికి వెళ్లిపోయారు. అడ్రస్ ఇచ్చినందున శాంపిల్ కోసం ఇంటికి వస్తారేమోనని వారు భావించారు. కానీ రెండు రోజులైనా రాకపోవడంతో ఇక శాంపిల్ తీసుకుంటారనే నమ్మకాన్ని వదులుకున్నారు.'ఎట్ రిస్క్' జాబితాలోనే దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విధిగా వారి శాంపిళ్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబితాలోని లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్‌గా కేవలం 2% మంది నుంచే శాంపిళ్లను సేకరిస్తున్నది. ర్యాపిడ్ పీసీఆర్ టెస్టు కోసం రూ. 2,900 వసూలు చేస్తున్న లాబ్ రెండు గంటల్లోనే రిపోర్టు ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. ఇందులో టెస్టు కోసం రూ. 1,720, కన్వీనియన్స్ పేరుతో మరో వెయ్యి రూపాయలు, జీఎస్టీ రూపంలో రూ. 180 చొప్పున వసూలు చేస్తున్నది.

దీనితో పాటు రెగ్యులర్ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష కూడా చేయాలంటూ అదనంగా మరో రూ. 500 (జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు లేకుండా) వసూలు చేస్తూ రిపోర్టును ఆరు గంటల తర్వాత ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. ప్రయాణికులందరి నుంచి టెస్టుల కోసం రూ. 3,400 వసూలు చేస్తున్నది. కానీ శాంపిళ్లు తీసుకుంటున్నది, పరీక్షలు చేస్తున్నది, రిపోర్టులు పంపిస్తున్నది కొద్దిమందికి మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ వ్యాప్తి నివారణ కోసం విదేశీ ప్రయాణికులపై నవంబరు 2వ వారం నుంచి ఆంక్షలను అమలుచేస్తున్నది. ఇప్పటివరకు హైదరాబాద్ విమానాశ్రయానికి సుమారు 60 వేల మంది ప్రయాణికులు వచ్చినట్లు అంచనా. ఇందులో 'మ్యాప్ మై జినోమ్' సంస్థ ఎంత మంది నుంచి టెస్టుల కోసం డబ్బులు వసూలు చేసింది. అందులో శాంపిళ్లు తీసుకున్నది ఎంత మంది నుంచి.. ఇలాంటి వివరాలేవీ బయటికి రావడంలేదు. కరోనా టెస్టు పేరుతో ఈ సంస్థ భారీ స్థాయిలోనే స్కామ్‌కు శ్రీకారం చుట్టింది. ఒమిక్రాన్ వచ్చిన తొలి రోజుల్లో రాపిడ్ పీసీఆర్ టెస్టుకు రూ. 3,900, ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుకు రూ. 999 చొప్పున వసూలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినదాని కన్నా ఎక్కువ మొత్తంలో ఎయిర్‌‌పోర్టుల్లో వసూలు చేస్తున్న వ్యవహారం పార్లమెంటు దృష్టికి వెళ్ళడంతో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం జీవో ద్వారా నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేయవద్దని ఆదేశించింది. దాంతో రెగ్యులర్ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు రేటు రూ. 500కు తగ్గించింది. అయితే ఒమిక్రాన్ ఇప్పుడు కామన్ అంశంగా మారిపోవడంతో కొత్త పద్ధతిలో దోపిడీని మొదలుపెట్టింది. డబ్బులు కట్టించుకుని టెస్టులు చేయకుండానే పంపించేస్తున్నది.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు టెస్టు రిపోర్టుతో సంబంధం లేకుండా పాజిటివ్ వచ్చినా నెగెటివ్ ఉన్నా ఇంట్లో ఐసొలేషన్‌లోనే ఉండిపోతున్నారు. పండుగకు కూడా కుటుంబ సభ్యులు, బంధువులతో కలవలేదు. శాంపిల్ తీసుకోకుండా, టెస్టు కూడా చేయకుండా ప్రైవేటు ల్యాబ్ డబ్బులు ఎందుకు కట్టించుకున్నదనే సందేహం వ్యక్తమైంది. విదేశాల నుంచి వచ్చినవారి నుంచి ఏదో ఒక ఫీజు రూపంలో ఈ తరహాలో కట్టించుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఇలాంటి నిబంధన విధించాయేమోనని వారిని వారు సమర్ధించుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ దోపిడీ విషయం వారికి అర్థమైంది. దీనిపై రాష్ట్ర వైద్యారోగ్య విభాగం సైతం సైలెంట్‌గానే ఉంటున్నది. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తొలి నాళ్లలో (నవంబరు నెలలో) 'ఎట్ రిస్క్' దేశాల నుంచి ఎంత మంది ప్రయాణికులు వచ్చారు, ఎన్ని శాంపిళ్లు తీసుకున్నారు, ఎన్ని పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. వారిలో ఎంత మందికి జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ అని ఖరారైంది.. లాంటి వివరాలను వైద్యారోగ్య విభాగం తెలుసుకునేది. కానీ ఆ తర్వాత 'ఎట్ రిస్క్' దేశాలు మాత్రమే కాక ఇతర దేశాలవారికీ పాజిటివ్ గా నిర్ధారణ కావడం, అందులో కొద్దిమందికి ఒమిక్రాన్ అని తేలడంతో వైద్యారోగ్య శాఖ కూడా లైట్‌గానే తీసుకున్నది. వైరస్ కమ్యూనిటీలోకి వెళ్లిపోయిందనే ఉద్దేశంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడం కూడా నిలిపేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మొత్తం విదేశీ ప్రయాణికుల శాంపిళ్ళలో కేవలం రెండు శాతం మాత్రమే సీక్వెన్సింగ్‌కు పంపుతున్నది.

Next Story

Most Viewed