బీసీల హక్కులు అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం కొనసాగిస్తే తిరుగుబాటు తప్పదు

by Ratna Kumari |

బీసీల హక్కులు అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం కొనసాగిస్తే తిరుగుబాటు తప్పదని పలువురు నేతలు హెచ్చరించారు.

బీసీల హక్కులు అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం కొనసాగిస్తే తిరుగుబాటు తప్పదు
X

దిశ, ఖైరతాబాద్ : బీసీల హక్కులు అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం కొనసాగిస్తే తిరుగుబాటు తప్పదని పలువురు నేతలు హెచ్చరించారు. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ వి. హనుమంత రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా అమలు కాలేదని విమర్శించారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు ఇప్పటికీ పథకాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం దురదృష్టకరమని, దశాబ్దాలుగా వివక్ష కొనసాగుతోందని అన్నారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జనాభాలో 90 శాతం ఉన్న వర్గాలు పక్కనపడి, తక్కువ శాతం ఉన్నవారు పాలనలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు. కులగణన అంశంపై స్పందిస్తూ, కర్ణాటకలో గణన జరిగినా చట్టబద్ధత రాలేదని, తమిళనాడులో మాత్రం రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ప్రయోజనాలు అందుతున్నప్పటికీ, బీసీలకు మాత్రం పరిమితులు విధించడం అన్యాయమన్నారు.బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ, 1881లోనే కులగణన ప్రారంభమై 1931లో బీసీల లెక్కలు తేల్చారని గుర్తు చేశారు.

స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ అంశంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని, వివిధ ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేశాయని విమర్శించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు బలగోని బాలరాజు గౌడ్ మాట్లాడుతూ ఓబీసీ వర్గానికి చెందిన ప్రధాని ఉన్నప్పటికీ ఆ వర్గానికి తగిన న్యాయం జరగలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే బీసీల ఓట్ల కోసం కులగణన ప్రస్తావన తీసుకువస్తున్నారని ఆరోపించారు.ఈ సమావేశంలో మాజీ డీజీపీ పూర్ణచందర్ రావు, ఎమ్మెల్యే శంకరయ్య, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ పాల్గొన్నారు.

Next Story