- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ ఉద్యమ ఫలితం.. మున్సిపల్ ఎన్నికల్లో 61% బీసీలే
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలు ఘన విజయం సాధించడం తెలంగాణలో కొనసాగుతున్న 42 శాతం రిజర్వేషన్ ఉద్యమానికి స్పష్టమైన ఫలితమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పేర్కొన్నారు.

దిశ, హిమాయత్ నగర్ : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలు ఘన విజయం సాధించడం తెలంగాణలో కొనసాగుతున్న 42 శాతం రిజర్వేషన్ ఉద్యమానికి స్పష్టమైన ఫలితమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అబిడ్స్ లోని బీసీ సంఘం భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, ఎన్నికలు పూర్తయిన 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీలు చైర్‌పర్సన్లుగా ఎన్నికై 60.95 శాతం పదవులను కైవసం చేసుకున్నారని తెలిపారు. వైస్ చైర్‌పర్సన్లలో 41 శాతం బీసీలే ఎన్నిక కావడం గమనార్హమన్నారు. ఏడు కార్పొరేషన్లలో నాలుగు చోట్ల బీసీలు మేయర్ పదవులు దక్కించుకోవడం ద్వారా మొత్తం 57.14 శాతం మేయర్ పదవులను సాధించారని వివరించారు. బీసీ రిజర్వేషన్ కింద 35 స్థానాలు గెలుచుకోవడంతో పాటు, జనరల్ కోటాలోనూ ఒక మేయర్, 27 మంది మున్సిపల్ చైర్‌పర్సన్లు బీసీ వర్గాలకు చెందడం ఈ ఎన్నికల ప్రత్యేకత అని పేర్కొన్నారు. సాధారణంగా జనరల్ స్థానాల్లో ఓసీ వర్గాల ఆధిపత్యం ఉండే పరిస్థితిని ఈసారి బీసీలు మార్చారని గుజ్జ సత్యం అన్నారు. సిరిసిల్ల, పోచంపల్లి వంటి చేనేత ప్రాంతాలు, నల్గొండ, వనపర్తి వంటి రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా బీసీలకు అవకాశాలు పెరిగినట్టు తెలిపారు. గౌడ, పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజ్ వర్గాలకు చెందిన నేతలు జనరల్ స్థానాల్లో గెలుపొందడం సామాజిక న్యాయానికి సంకేతమన్నారు. ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాలను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో 55 శాతం పైగా వార్డుల్లో బీసీలే విజయం సాధించడం ఉద్యమ బలం ఎంత పెరిగిందో చూపుతోందన్నారు.స్థానిక సంస్థల్లో వచ్చిన ఈ ఫలితాలు ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతం అని, జనాభా దామాషా న్యాయం సాధించే వరకు ఉద్యమం ఆగదని గుజ్జ సత్యం హెచ్చరించారు.






