దర్జాగా రోడ్లు కబ్జా.. పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు

by Bhanu |

రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ గా వ్యాపారాలు కొనసాగిస్తూ ఇరుకుగా ఉన్న రోడ్లను కబ్జా చేస్తూ నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యేలా వ్యవహరిస్తున్న వస్త్ర దుకాణాల యజమానుల పరిస్థితి అంతా ఇంతా కాదు.

దర్జాగా రోడ్లు కబ్జా.. పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు
X

దిశ, చైతన్యపురి: రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ గా వ్యాపారాలు కొనసాగిస్తూ ఇరుకుగా ఉన్న రోడ్లను కబ్జా చేస్తూ నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యేలా వ్యవహరిస్తున్న వస్త్ర దుకాణాల యజమానుల పరిస్థితి అంతా ఇంతా కాదు. రెసిడెన్షియల్ జోన్ ప్రాంతం కదా అని ఇటు వైపు ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించరు. తద్వారా ప్రజలు అవస్థలు పడుతుంటారు. అసలు ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా మీకోసమే ఈ కథనం.

ఎక్కడ ఇది..

గడ్డిఅన్నారం డివిజన్ కోదండరాం నగర్ కాలనీ. ఈ కాలనీ మొత్తం రెసిడెన్షియల్ జోన్. కానీ కోఠి, సుల్తాన్ బజార్ ను తలపిస్తుంది. అడ్డు అదుపులేని వస్త్ర వ్యాపార కాలనీగా పేరుంది. ఎప్పుడో కొన్ని ఏండ్ల క్రితం నిర్మాణమైన కాలనీ. అప్పటి రద్దీ దృష్ట్యా 25 ఫీట్లు రోడ్లు ఏర్పాటు చేసారు. కానీ నేడు జనావాసాలు ఎక్కువగా ఉండడం, ఒక్కొక్క ఇంటి నిర్మాణం 3 నుండి నాలుగు, ఐదు అంతస్తులు ఉండడం, ప్రజలు అధికంగా నివసించడం, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం మొదలైన అంశాలతో నిత్యం రద్దీ ఉంటుంది. దీనికి తోడు ఇక్కడ రెడ్డి బ్రదర్స్ పేరుతో వస్త్ర వ్యాపారాలు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. వీరికి తోడుగా మరికొన్ని వస్త్ర షాపింగ్ లు ఏర్పాటు చేసారు. రోజురోజుకి ఫుట్ పాత్, వీధులు ఆక్రమిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ షాపింగ్ మాల్స్ కు కనీసం పార్కింగ్ సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. ఇరుకు రోడ్లపై ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపి ఉంచడం వలన తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. తద్వారా కాలనీ వాసులు అసౌకర్యానికి గురవుతూ తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. పలుమార్లు ట్రాఫిక్ పోలీసులకు, జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. యదేచ్చగా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపారాలు సాగుతుండడంతో అరాచకాలు శృతిమించి పోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఫుట్ పాత్ లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తూ వినియోగదారులను అడ్డగిస్తూ వికృత చేష్టలు చేస్తున్నారని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

రోడ్డుకు అడ్డంగా వాహనాలు ఆపి

వియోగదారులు వస్త్రాలు కొనుగోలు కోసం తమ తమ వాహనాలపై ఆ వీధి గుండా వస్తున్న సమయంలో వస్త్ర దుకాణాల ముందు వాచ్ మెన్ లను ఏర్పాటు చేసి వారిచేత వాహనాలకు అడ్డంగా వెళ్లి కస్టమర్స్ ను వారి వారి దుకాణాలలోకి లాక్కొని వెళుతున్నారని విమర్శలున్నాయి. మగ్గం దుకాణాలలో పనిచేసే వ్యక్తులు బీహార్, చత్తీస్ ఘడ్ ప్రాంతాలకు చెందిన వారు కావడం రాత్రి సమయంలో కాలనీ రోడ్ల వెంట తిరుగుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు పలువురు తెలిపారు.

పట్టించుకోని జీహెచ్ఎంసీ

జీహెచ్ఎంసీ సరూర్నగర్ సర్కిల్ 5 అధికారులు, ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం, అలసత్వం మూలంగా ఫుట్ పాత్ లు, వీధులు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న పట్టించుకోవడంలేదని కాలనీవాసులు విమర్శిస్తున్నారు. వ్యాపారాలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వలన ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్నారు. దుకాణాలకు టాక్స్ వసూలు చేయడం తప్ప కాలనీ ప్రజల ఇబ్బందులు గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జిహెచ్ఎంసి అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నారు. కోదండరాంనగర్ లో ఫుట్ పాత్ లు లేవని రెడ్డి బ్రదర్స్ దుకాణాల వీధిలో ఆయా దుకాణాల ముందు రోడ్లపై ద్విచక్ర వాహనాలు నిలపడం వలన ఇరుకుగా మారాయని జిహెచ్ఎంసి అధికారులు చెబుతున్నారు. ఫుట్ పాత్ లు ఆక్రమిస్తే మేము చర్యలు తీసుకుంటామని అసలు ఫుట్ పాత్ లే ఇక్కడ లేనప్పుడు మేం ఏ విధంగా చర్యలు తీసుకుంటామని వారు పేర్కొంటున్నారు. వీధిలో రోడ్లపై ద్విచక్ర వాహనాలు నిలపడం ఇది ట్రాఫిక్ పోలీసులు తీసుకోవలసిన చర్యలని వారంటున్నారు. ఈ రెడ్డి బ్రదర్స్ వీధిగుండా వెళ్లాలంటే భయపడిపోయే పరిస్థితి దాపురించిందని ఇకనైనా చర్యలు తీసుకొని రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు.



Next Story