రెసిడెన్షియల్ అనుమతులు.. కమర్షియల్ నిర్మాణాలు!

by Pulgam srinivas |

బడంగ్‌పేట్ సర్కిల్ ప్రధాన రహదారి పక్కనే రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ షెటర్ల నిర్మాణం చేపట్టారని తెలిసింది.

రెసిడెన్షియల్ అనుమతులు.. కమర్షియల్ నిర్మాణాలు!
X

దిశ, మీర్‌పేట్: రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు కంటికి కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. బడంగ్‌పేట్ సర్కిల్ ప్రధాన రహదారి పక్కనే కమర్షియల్ షెటర్ల నిర్మాణం చేపట్టారని తెలిసింది. నిర్మాణం పూర్తికాక ముందే ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్న ఆ అక్రమ నిర్మాణాలపై అధికారులు మాత్రం చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ గృహకల్పలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఇంటి నిర్మాణం కొరకు అనుమతులు తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్‌లో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారని తెలిసింది. ఆ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోలేదని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు.

సస్పెండ్ అయిన మారని తీరు..

చెయ్యని పనులకు బిల్లులు చెల్లించారని, కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఏసీబీతో పాటు, విజిలెన్స్ అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు నివేదిక అందించడంతో పదిమంది అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినా టౌన్ ప్లానింగ్ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని బహిరంగంగా పలు రాజకీయ పార్టీల నాయకులు మీడియా సమావేశాల్లో చెబుతున్నా వారి తీరు మారడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

చర్యలు శూన్యం?..

బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో 49 అక్రమ నిర్మాణాలు గుర్తించామని, మొదటి, 2వ నోటీసులు జారీ చేయని అక్రమ నిర్మాణాలను గుర్తించామని ఏసీబీ అధికారులు చెప్పారు. ఇదంతా జరిగి నెల కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. పదిమంది అధికారులపై వేటు పడినా టౌన్ ప్లానింగ్ సైన్యం కనుసన్నల్లోనే నేటికీ అక్రమ నిర్మాణాలు నడుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినా అనంతరం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నేటికీ ఏ అక్రమ నిర్మాణాన్ని కూల్చింది లేదు? ఏ అక్రమ నిర్మాణంపై చర్యలకు పూనుకున్నది లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ జేబులు నింపితే చాలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడినా మాకేం సంబంధం అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

నోరుమెదపని అధికారులు..!

బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నిర్మాణం, అనుమతులు తీసుకుని సుమారు 6 కమర్షియల్ షెటర్ల నిర్మాణం చేపడుతున్నా అధికారులు ఎందుకు నోరుమెదపడం లేదని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు నుంచి అల్మాస్ గూడ రాజీవ్ గృహకల్పకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే రెసిడెన్షియల్ అనుమతి తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్‌లో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టినా అధికారుల కంటికి ఎందుకు కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

నందిహిల్స్‌లో అదే పరిస్థితి..

జి ప్లస్ వన్ పర్మిషన్ తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్‌లో కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులకు ఎందుకు కనిపించడం లేదని, ఆ నిర్మాణంపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పది మంది అధికారులను సస్పెండ్ చేసిన టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులతో పాటు సిబ్బంది తీరు ఎందుకు మారడం లేదని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

టౌన్ ప్లానింగ్ విభాగంలోనే అవినీతి?

బడంగ్‌పేట్ సర్కిల్‌లో శానిటేషన్, ఇంజినీర్ విభాగంలో కంటే ఎక్కువగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవినీతి జరిగిందని, ఆ విభాగంపై ఏసీబీ, విజిలెన్స్ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సిబ్బంది కనుసన్నలో?..

బడంగ్‌పేట్ సర్కిల్‌లో టౌన్ ప్లానింగ్ విభాగం చైన్‌మెన్‌లుగా విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బంది కావడంతో వారిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారునికి అభయమిస్తూ, 'మేము ఉన్నాం మీ నిర్మాణం కొనసాగనివ్వండి, అధికారులతో పాటు మాజీ ప్రజాప్రతినిధిని మేము చూసుకుంటాం' అని భరోసా ఇస్తున్నారని స్థానికులు గుసగుసలాడుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎన్నో జరుగుతున్నా నోటీసులు కూడా జారీ చేయలేని దుస్థితిలో టౌన్ ప్లానింగ్ విభాగం ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్క ఫైల్ ఒక రేటుతో సిబ్బంది అన్నీ తామై వ్యవహరిస్తుండడంతో అక్రమ నిర్మాణదారులకు ఆందోళన లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడుతున్న అధికారులతో పాటు అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story