Hyderabad Rain : హయత్ నగర్ డివిజన్ ను ముంచెత్తిన వాన

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-22 16:15:28  IST  )

భారీ వర్షాలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆయా కాలనీలు నీట మునిగాయి. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్ డివిజన్ అతలాకుతలం అయింది.

Hyderabad Rain : హయత్ నగర్ డివిజన్ ను ముంచెత్తిన వాన
X

హయత్ నగర్ డివిజన్ ను ముంచెత్తిన వాన

–నీటి మునిగిన శివారు కాలనీలు, బస్తీలు

–భారీ వర్షాలకు తోడైన ఇంజాపూర్ చెరువు అలుగు

దిశ, వనస్థలిపురం : భారీ వర్షాలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆయా కాలనీలు నీట మునిగాయి. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్ డివిజన్ అతలాకుతలం అయింది. మన్సూరాబాద్ డివిజన్ లోని పలు కాలనీల్లో మొకాలి లోతు నీరు నిలిచాయి. ఇంజాపూర్ చెరువు అలుగు పారుతుండడంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. వర్షాలు పడినప్పుడల్లా హయత్ నగర్ డివిజన్ లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం డివిజన్ల మీదుగా గడువును ఉన్న ఇంజాపూర్ చెరువు నిండి అక్కడి వరద హయత్ నగర్ లోకి వస్తుంది.

– జలదిగ్బంధంలో బస్తీలు

హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీ, రంగనాయకులగుట్ట కాలనీ పూర్తిగా నీట మునిగాయి. వీధుల్లోకి నడుం లోతు వరకు నీరు చేరింది. ఈ కాలనీలు ప్రతి వానాకాలంలో జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి. ముంపు నివారణకు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినా పూర్తి స్థాయిలో ముంపును నివారించలేక పోయాయి.‌ బంజారా కాలనీ, రంగనాయకులగుట్ట కాలనీ ప్రజలు పూర్తిగా రోజువారీ కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, మహిళలు పారిశుద్ధ్య కార్మికులుగా, కొందరు మహిళలు భవన నిర్మాణ కూలీలుగా పని చేసి జీవిస్తున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షం బస్తీ వాసులకు కన్నీళ్లు మిగిల్చాయి. తెల్లవారేసరికి ఇండ్లలోకి వరద చేరింది. బంజారా కాలనీ పూర్తిగా నీట మునిగింది. రంగనాయకులగుట్టలో రెండు వీధులు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఆయా ఇండ్లలోకి నీరు చేరడంతో పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీతారాంపురి కాలనీలో పలు ఇండ్లలోకి నీరు చేరింది. మోటార్లు వేసి, ఇండ్లలో చేరిన నీటిని బయటకు పంపిస్తున్నారు.

– సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లలో నీట మునిగిన కాలనీల్లో వివిధ శాఖల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హయత్ నగర్ డివిజన్ లోని బంజారా కాలనీ, రంగనాయకులగుట్ట కాలనీలు జీహెచ్ఎంసీ, డీఆర్డీఎఫ్ అధికారులు, సిబ్బంది నీటిని తొలిగించే పనులు ప్రారంభించారు. జేసీబీ సాయంతో నాలాల్లో చేరిన పూడికను తొలిగిస్తూ వరదను బయటకు పంపిస్తున్నారు. వీధుల్లోకి నీరు చేరడంతో ఇండ్లలో ఉన్నవారికి ఆహారం అందిస్తున్నారు.

– ముంపు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటన

హయత్ నగర్ డివిజన్లోని ముంపు ప్రాంతాలను ప్రజాప్రతినిధులు పర్యటించారు. బంజారా కాలనీ, రంగనాయకులగుట్టలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ తో పాటు వివిధ పార్టీల నాయకులు పర్యటించి, ప్రజలతో మాట్లాడారు. ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

– నాలాలు, కాల్వల కబ్జాలతోనే ముంపు సమస్య

ఇంజాపూర్ నూర్ఖాన్ చెరువు నుంచి వరద రాచకాలువ, జాలు కాలువ ద్వారా హయత్ నగర్ బాతుల చెరువులోకి వస్తాయి. కానీ రాచకాల్వ, జాలు కాల్వను కబ్జాకోరులు, అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లు ఆక్రమించడంతో బాతుల చెరువులోకి వెళ్తాయి. రాచకాల్వ, జాలు కాలువ కబ్జా కావడంతో ప్రవాహంలో వచ్చిన వరద కాలువలు పూర్తిగా మూసుకుపోవడంతో హయత్ నగర్ లోని బంజారా కాలనీ, సత్తిరెడ్డి కాలనీ, అంబేద్కర్ కాలనీ, రంగనాయకుల గుట్ట కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాచకాల్వ, జాలు కాలువ కబ్జాలను అరికట్టి వరద సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story