హైదరాబాద్‌లో పెరుగుతున్న గన్ కల్చర్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ టాప్

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్ లో సంపన్న ప్రాంతాల్లో లైసెన్స్ పొందిన గన్స్ సంఖ్య ఎక్కువగా ఉందన్న వార్త అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలో గన్ కల్చర్ పెరిగిందనేందుకు ఇదే నిదర్శనమంటున్నారు కొందరు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న గన్ కల్చర్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ టాప్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొద్దిరోజుల్లో ఉపఎన్నిక జరగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రోడ్ షో లు, సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నగరంలో అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే. ఈ క్రమంలో హైదరాబాద్ లో సంపన్న ప్రాంతాల్లో లైసెన్స్ పొందిన గన్స్ సంఖ్య ఎక్కువగా ఉందన్న వార్త అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలో గన్ కల్చర్ పెరిగిందనేందుకు ఇదే నిదర్శనమంటున్నారు కొందరు. లైసెన్స్ గన్స్ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసుల డేటా చెబుతోందని హైదరాబాద్ మెయిల్ అనే వార్తా సంస్థ పేర్కొంది.

సదరు వార్తా సంస్థ పేర్కొన్న దానిప్రకారం.. పోలీసుల రికార్డుల్లో హైదరాబాద్ లోని 99 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 3,709 మంది తమ వద్దనున్న ఆయుదాలకు లైసెన్స్ పొందగా.. వారిలో 906 మంది అంటే సుమారు 25 శాతం మంది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు చెందినవారే ఉండటం గమనార్హం. లైసెన్స్ పొందిన ఆయుధాల్లోనూ అధికంగా పిస్టల్స్, రివాల్వర్లు ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెప్తున్నాయి. ఒక్క బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 567 లైసెన్స్ హోల్డర్లు ఉండగా.. వారి వద్ద 844 ఆయుధాలున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ లో 234 మంది లైసెన్స్ హోల్డర్లు ఉండగా.. ఉపఎన్నిక జరగనున్న క్రమంలో ఆయుధాలను పోలీసులకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంకా రెండు డజన్లమంది వరకూ తమ ఆయుధాలను డిపాజిట్ చేయలేదని తెలుస్తోంది.

పోలీసులకు డిపాజిట్ అయిన ఆయుధాలను నగరంలో ఉన్న 10 ఆర్మొరీస్ లో భద్రపరిచారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఉండటంతో.. అలారాలు, సీసీటీవీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశారు. కాగా.. జూబ్లీహిల్స్ లో పలువురు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, మాజీ మంత్రులు లైసెన్స్డ్ వెపన్స్ కలిగి ఉండగా.. ఇటీవల కాలంలో వాటిని భయపెట్టేందుకు వాడినట్లు ఎలాంటి నివేదికలు లేవని ఒక సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. గతంలో ఆయుధాల లైసెన్స్‌లకు ఏటా రెన్యువల్ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు దాని చెల్లుబాటు కాలం ఐదేళ్లకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్‌ను రెన్యువల్ చేయడంలో విఫలమైతే, అది రద్దవుతుంది. ఫలితంగా ఆ వెపన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు.

Next Story