చలాన్‌లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రణపై ఏది?

by Dishafeatures2 |
చలాన్‌లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రణపై ఏది?
X

దిశ, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చలానాల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రణపై లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లలో సిగ్నల్‌తో సంబంధం లేకుండా ఎడమ వైపు వెళ్లాల్సిన వాహనదారుల కోసం నగర ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన ఫ్రీ లెఫ్ట్ నిబంధన ఎక్కడా కూడా అమలు కావటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, మాసాబ్ ట్యాంక్ చౌరస్తా, పంజాగుట్ట చౌరస్తాతో పాటు కొత్త సచివాలయానికి సమీపంలో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింద నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపు ఏర్పాటు చేసిన రూట్‌లోని కూడలి వద్ద ఫ్రీ లెఫ్ట్ అమలు కాకపోవటంతో లెఫ్ట్ సైడ్ వెళ్లాల్సిన వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు. లిబర్టీ నుంచి బీఆర్కేఆర్ భవన్ వైపు లెఫ్ట్ సైడుగా రావల్సిన వాహనాలు అంబేడ్కర్ చౌరస్తా నుంచి లిబర్టీ వరకు క్యూ కడుతున్నాయి.

మరికొన్ని జంక్షన్లలో కేవలం ఫొటోలు తీస్తున్నారే తప్పా, ఫ్రీ లెఫ్ట్ సైడ్‌గా వాహనాలు వెళ్లేలా చర్యలేమీ చేపట్టడం లేదని వాహనదారులంటున్నారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ జంక్షన్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సిన వాహనాలు జీహెచ్ఎంసీ గేటు వరకు లెఫ్ట్ సైడు నిలబడుతున్నా, కనీసం పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించటం లేదని వాహనదారులు వాపోతున్నారు. పంజాగుట్ట, ప్యాట్నీ చౌరస్తాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పంజాగుట్ట చౌరస్తాలో ఖైరతాబాద్ నుంచి బంజారాహిల్స్ వెళ్లాల్సిన వాహనాలు సిగ్నల్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. చాలా సందర్భాల్లో అంబులెన్స్‌లు కూడా చిక్కుకోవటంతో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు రంగంలోకిదిగి ట్రాఫిక్‌ను నియంత్రించటంతో అంబులెన్స్‌లు ముందుకు కదిలే పరిస్థితి నెలకొంది. ఇలా చాలా రద్దీ జంక్షన్లలో ఫ్రీ లెఫ్ట్ కేవలం బోర్టులకే పరిమితమవుతుంది.

హోటళ్లకు పార్కింగ్‌గా..

నగరంలో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్‌లలో ఫ్రీ లెఫ్ట్‌లు అక్కడి నుంచి సమీపంలో ఉన్న హోటళ్లకు పార్కింగ్‌గా మారిపోయింది. అక్కడి నుంచి సమీపంలోనే ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా, ఫ్రీ లెఫ్ట్‌లో వాహనాలను ఆపటాన్ని నియంత్రించలేకపోతున్నారు. దీనిలో ఆంతర్యమేమిటీ? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. నగరంలోని ఓ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్‌కు నెలకు సుమారు రూ.6 లక్షల వరకు మామూళ్లొస్తున్నాయనే ఆరోపణలున్నాయి. మాసాబ్ ట్యాంక్ చౌరస్తాలో బంజారాహిల్స్ నుంచి లక్డీకాపూల్ వైపు వెళ్లే వాహనాలకు ఫ్రీ లెఫ్ట్ కల్పించినా, అది ఏమాత్రం అమలు కావటం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఈ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్‌కు వచ్చే భోజన ప్రియులు తమ కార్లను, బైక్‌లను ఫ్రీ లెప్ట్‌లో పార్కింగ్ చేసి వెళ్లటంతో, బంజారాహిల్స్ నుంచి ఈ చౌరస్తా మీదుగా లక్డీకాపూల్ వెళ్లే వాహనదారులకు ట్రా ఫికర్ తప్పటం లేదు.


Next Story