పెనాల్టీ రూ.లక్షల్లో.. వసూలు ‘సున్నా’!

by Ajay Maddhiboyina |

‘రూ. 78, 59, 775’.. ఇది ‘నమిశ్రీ ఇన్​ఫ్రాస్ట్రక్షర్​ అండ్​ ప్రాజెక్ట్స్​ ప్రైవేట్​ లిమిటెడ్’​ నిర్మాణ సంస్థకు రంగారెడ్డి జిల్లా మైనింగ్​ ఏడీ వేసిన ఫెనాల్టీ..

పెనాల్టీ రూ.లక్షల్లో.. వసూలు ‘సున్నా’!
X

దిశ, వనస్థలిపురం: ‘రూ. 78, 59, 775’.. ఇది ‘నమిశ్రీ ఇన్​ఫ్రాస్ట్రక్షర్​ అండ్​ ప్రాజెక్ట్స్​ ప్రైవేట్​ లిమిటెడ్’​ నిర్మాణ సంస్థకు రంగారెడ్డి జిల్లా మైనింగ్​ ఏడీ వేసిన ఫెనాల్టీ.. సరూర్​ నగర్​ మండలం.. మన్సూరాబాద్ (ఆటోనగర్​) రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్​ 38లో ‘నమిశ్రీ’ సంస్థ అనుమతులకు మించి మట్టి తవ్వడంతో 2024 ఆగస్టులో ఈ పెనాల్టీ విధించారు. పెనాల్టీ చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్​–1864 ప్రకారం.. సెకండ్​ నోటీసు లేకుండానే జరిమానా వేసిన 15 రోజుల్లో మైనింగ్​ శాఖ రికవరీ చర్యలు తీసుకోవాలి. కానీ చర్యల సంగతి దేవుడెరుగు.. రెండేండ్లు కావస్తున్నా.. అక్రమాలు.. పెనాల్టీలు రెండూ పెరుగుతూ.. లక్షల రూపాయలు కోట్లలోకి వెళ్లాయి.. తప్పా.. ఇప్పటి వరకు పైసా కూడా వసూల్​ చేయలేదు. కోట్ల రూపాయలు పెనాల్టీలు ఉన్నా.. డోంట్​ కేర్​ అంటూ.. బరితెగించిన ‘నమిశ్రీ’ యథాతథంగా నేటికీ రాత్రింబవళ్లు మట్టి గ్రావెలింగ్​ అక్రమాలకు పాల్పడుతున్నది. పైగా ఎలాంటి టీపీ ( టెంపరరీ పర్మిషన్​) లేకుండా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ఎగ్గొడుతూ.. కోట్లాది రూపాయల మట్టిని యథేచ్ఛగా అమ్ముకుంటున్నది. అక్రమ గ్రావెల్​ తో పాటు స్థానికంగా హిటాచీల మోతలు, వందలాది టిప్పర్ల దెబ్బకు ఎదురవుతున్న సమస్యలపై స్థానికుల నుంచి వందలాది ఫిర్యాదులు వెళ్తున్నా.. మైనింగ్​ శాఖ నామ్​కే వాస్తే నోటీసులు, పెనాల్టీలతో ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నది. ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో రంగారెడ్డి జిల్లా మైనింగ్​ ఏడీ నర్సింహ్మారెడ్డి అక్టోబర్​ 25న జీహెచ్​ఎంసీ ఎల్బీనగర్​ జోనల్​ కమిషనర్​, సరూర్​ నగర్​ తహశీల్దార్​, వనస్థలిపురం ఎస్​ హెచ్​ వోకు ‘నమిశ్రీ’పై చర్యలు తీసుకోవాలని లెటర్​ రాసి చేతులు దులుపుకున్నారు. ఈ శాఖల అధికారులు కూడా ఆరంభ శూరత్వంతో చర్యలు చేపట్టి ముడుపులు ముట్టడంతో ‘మట్టి తవ్వకాలతో మాకేం సంబంధం’ అంటూ.. మాట్లాడుతున్నారని, స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇదీ విషయం..

మన్సూరాబాద్​ గ్రామం సర్వే నంబర్​ 39, 40, 38లో ఇందిరా నగర్​, విజయశ్రీ కాలనీ ఫేజ్​ 1,2లలో ‘నమిశ్రీ ఇన్​ ఫ్రాస్ట్రక్షర్​ అండ్​ ప్రాజెక్ట్స్​ ప్రైవేట్​ లిమిటెడ్’​ నిర్మాణ సంస్థ సుమారు 10 ఎకరాల్లో 24 అంతస్థుల భారీ హైరైజ్​ టవర్ల నిర్మాణం ఫేజ్ ​ల వారీగా నిర్మిస్తోంది. మొదటి నుంచి సెల్లార్ల పేరుతో అనుమతులకు మించి మట్టి తవ్వకాలు, రాయల్టీ కట్టకుండా ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతోంది. స్థానికులు ఫిర్యాదులు చేయడంతో మైనింగ్​ అధికారులు పరిశీలించి 35,726.25 మెట్రిక్​ టన్నుల మట్టిని అక్రమంగా తవ్వినట్లు గుర్తించి.. రూ. 7,14,525 సీజ్ ​నియరేజ్​ ఫీజుకు పది రెట్లు జరిమానాతో కలిపి రూ. 78,59,775 డిమాండ్​ నోటీస్​ ఇచ్చారు. ఏండ్లు గడుస్తున్నా.. పెనాల్టీలు కాగితాలకే పరిమితమయ్యాయి తప్పా.. అక్రమాలు ఆగలేదు.. ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాలేదు. ఇదే కాకుండా.. అంతకుముందు సర్వే నంబర్​ 39, 40లో ఇప్పటికే నిర్మాణం పూర్తి కావస్తున్న టవర్ల సెల్లార్ల తవ్వకాలపై కూడా భారీగా పెనాల్టీలు పెండింగ్​ ఉన్నట్లు తెలుస్తోంది. అలా ‘నమిశ్రీ’ ఒక్క మన్సూరాబాద్​ ప్రాజెక్టులోనే మొత్తం రూ. 3.5 కోట్ల మైనింగ్​ జరిమానాలు పెండింగ్​ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

అధికారుల చర్యలు శూన్యం..

‘మన్సూరాబాద్​ లో ‘నమిశ్రీ’ చేపడుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకం, రవాణా నిలిపివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆ ప్రాంతంపై నిఘా పెట్టాలి. నియంత్రణ చర్యలు తీసుకోవాలి.’ అంటూ.. 2025 అక్టోబర్​ 25న రంగారెడ్డి జిల్లా మైనింగ్​ ఏడీ నర్సింహ్మారెడ్డి జీహెచ్​ఎంసీ ఎల్బీనగర్​ జోనల్​ కమిషనర్​, సరూర్​ నగర్​ తహశీల్దార్​, వనస్థలిపురం పోలీస్​ ఇన్​ స్పెక్టర్ కు అధికారిక లేఖలు రాశారు. అక్రమాలను ఆదిలోనే కట్టడి చేయాల్సిన మైనింగ్​ శాఖ నోటీసులు, పెనాల్టీలు వేసి.. లేఖలు రాసి చేతులు దులుపుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూడు శాఖల అధికారులు చర్యలు తీసుకున్నారా? అంటే అదీ లేదు. జీహెచ్​ఎంసీ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోగా.. సరూర్​ నగర్​ రెవెన్యూ అధికారులు నామ్​కే వాస్తే పరిశీలనలు చేసి.. వెళ్లిపోయారు. వనస్థలిపురం ఏడీ లెటర్​ రాయకముందే.. స్థానికుల ఫిర్యాదుతో ఒక టిప్పర్ లారీని పట్టుకుని సీజ్ చేశారు. కానీ వారూ మైనింగ్​ ఏడీ లెటర్​ తర్వాత అటువైపు వెళ్లలేదు. అంతా ముందుగానే ముడుపులు ముట్టడంతో చేష్టలుడిగి కూర్చున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. కలెక్టర్​ స్పందించక పోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని లేఖలు రాశాం..

‘నమిశ్రీ’ అనుమతులకు మించి మట్టిని తవ్వినట్లు గుర్తించి గతేడాది రూ. 78,59,775 ​పైన్​ వేశాం. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. మళ్లీ పనులు కొనసాగిస్తుండడంతో చర్యలు తీసుకోవాలని ఇటీవల జీహెచ్​ఎంసీ, రెవెన్యూ , పోలీసు అధికారులను కోరుతూ అధికారిక లేఖలు రాశాం. వాళ్లే చర్యలు తీసుకోవాలి. ఇంతకంటే మేం ఏం చేయలేం. వాళ్లు కోర్టుకు వెళ్లారని తెలుస్తోంది. కోర్టుకు పోయినా సెల్లార్​ నిర్మించేసమయంలోనైనా న ఆక్యుపెన్సీ సర్టిఫికెట్​ అవసరం. ఆ సమయంలో ఎన్వోసీ రిలీజ్​ చేయం.

– ఎం నర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా మైనింగ్​ ఏడీ

పనులు ఆపించాం..

మైనింగ్​ శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఆర్​ఐని పంపించి ఎంక్వైరీ చేయించాం. అదే సమయంలో మైనింగ్​ శాఖ అధికారులు, పోలీసులు కూడా వచ్చారు. పనులు ఆపించాం. మళ్లీ పనులు జరిగితే, అక్రమ గ్రావెలింగ్​ ను ఆపి.. పోలీసులు ఏదైనా మా దృష్టికి తెస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు నమిశ్రీ అక్రమ మట్టి దందాపై వనస్థలిపురం పోలీసుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.

– వేణుగోపాల్​, తహశీల్దార్​, సరూర్​ నగర్​

ఫిర్యాదులు వస్తే కేసులు నమోదు చేస్తం...

మైనింగ్​ శాఖ నుంచి లెటర్​ రాక ముందే అక్రమ మట్టిని తవ్వుతూ.. టిప్పర్లతో తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెళ్లి అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్​ ను సీజ్​ చేసి కేసు చేశాం. నమిశ్రీ మైనింగ్​ అక్రమాలను అడ్డుకోవాలని ఇటీవల మైనింగ్ ఏడీ నుంచి లెటర్​ వచ్చింది. కానీ అక్కడ ఇటీవల మళ్లీ మట్టి తవ్వుతున్న విషయం మా దృష్టికి రాలేదు. తరుచూ వెళ్లి మట్టి తవ్వకాలపై పర్యవేక్షణ చేయలేం కదా.. మళ్లీ స్థానికులో, మైనింగ్​, తహశీల్దార్​ నుంచి ఏదైనా ఫిర్యాదు వస్తే.. తప్పకుండా కేసులు నమోదు చేస్తం.

– టీ మహేశ్​, సుస్థిరం సీఐ

Next Story