తెలంగాణ ఫలాలను సీఎం కేసీఆర్​ కుటుంబం ఒక్కటే అనుభవిస్తుంది

by Disha Web Desk 15 |
తెలంగాణ ఫలాలను సీఎం కేసీఆర్​ కుటుంబం ఒక్కటే అనుభవిస్తుంది
X

దిశ,ముషీరాబాద్ : తొలి, మలిదశ ఉద్యమ కారుల త్యాగాల ఫలాలను సీఎం కేసీఆర్​ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. 1969 తెలంగాణ ఉద్యమ కారులను తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులను అందజేయాలని డిమాండ్​ చేశారు. 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద సమస్యల పరిష్కారానికి, డిమాండ్ల సాధనకు మహాధర్నా చేపట్టారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్రహరి రామరాజు అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో ముఖ్య అతిథులుగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఆచార్య కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్,

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్​ సభ్యులు బాలమల్లేష్ లు పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆచార్య కోదండరాం మాట్లాడతూ సీఎం కేసీఆర్​ ఏనాడూ ఉద్యమ కారులను గౌరవించలేదని, ఉద్యమకారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్ ను గద్దెదించితేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన వస్తుందన్నారు. అధికార మర్పిడి జరిగితేనే ఉద్యమకారుల సమస్యలు పరిష్కరారమవుతాయని, ఆ దిశలో ఉద్యమకారులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​ మాట్లాడతూ తెలంగాణ సాధన కోసం 1969లో జరిగిన ఉద్యమమే కీలకమైందన్నారు. 1969 ఉద్యమ స్ఫూర్తితో జరిగిన మలిదశ ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యిందన్నారు. తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన అమరవీరులకు తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల ఫలాలను కేసీఆర్​ కుటుంబం అనుభవిస్తుందని విమర్శించారు. 1969 ఉద్యమకారులను

ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేని వారు ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతుంటే తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమ కారులు హక్కుల సాధన కోసం ధర్నాలు చేయాల్సి రావడం దారుణమన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మాట్లాడుతూ ఉద్యమంలో యువత ప్రాణాత్యాగాలు చేస్తుంటే స్పందించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. తొలిమలి దశ ఉద్యమకారులకు మాత్రం బీఆర్ఎస్​ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. సంఘం అధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం 1969 ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గౌరవ ప్రదమైన పెన్షన్​ అందించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రమౌళి, సంతోష్​రెడ్డి, చంద్రారెడ్డి, అమరేందర్​గౌడ్​, శివారెడ్డి, సూర్యనారాయణ, సీతారాంరెడ్డి, లక్ష్మారెడ్డి, మోహన్​రావు, సత్యనారాయణ, కృష్ణ, దయానంద్​ తదితరులు పాల్గొన్నారు.

Next Story