గత 3 ఏళ్లుగా వేతనాలు పెంచలేదు.. కొలిక్కిరాని సినీ కార్మికుల సమస్య

by Chintha Aamani |   (  Updated:2025-08-11 14:48:59  IST  )

తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు తమ వేతనాలు 30% పెంచాలని డిమాండ్ చేస్తూ 8 వ రోజు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

గత 3 ఏళ్లుగా వేతనాలు పెంచలేదు.. కొలిక్కిరాని సినీ కార్మికుల సమస్య
X

దిశ, జూబ్లీహిల్స్: తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు తమ వేతనాలు 30% పెంచాలని డిమాండ్ చేస్తూ 8 వ రోజు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా టాలీవుడ్‌లోని అన్ని షూటింగ్స్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పరిశ్రమ మొత్తం స్తంభించి పోయింది. ఇతర భాషా ఫిల్మ్ ఇండస్ట్రీలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు సినీ కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా స్పందించగా, గత మూడు ఏళ్లుగా వేతనాల్లో పెంపు లేనందున ఈ డిమాండ్ సమంజసమేనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఒకేసారి 30% పెంపు కష్టమని నిర్మాతల వర్గం స్పష్టం చేస్తోంది.

ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు - ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు ఫలితం లేకపోవడంతో వివాదం మరింత ముదిరింది. కృష్ణా నగర్‌లో ఈ రోజు నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. నిర్మాతల మండలి ప్రతిపాదన ప్రకారం, రోజువారీ వేతనం రూ.2,000 లోపు ఉన్న కార్మికులకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంపు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఈ పర్సెంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ తిరస్కరించి, ఒకేసారి 30% పెంపు తప్ప మేం అంగీకరించమని స్పష్టం చేసింది.

ఫెడరేషన్ ప్రకారం, నిర్మాతలు కొన్ని యూనియన్లను విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. "నిర్మాతల షరతులపై సుముఖంగా ఉన్నా, అవి దశలవారీగా కాకుండా వెంటనే అమలు కావాలి" అని ఫెడరేషన్ నేతలు చెబుతున్నారు. ఈ సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని, భవిష్యత్ కార్యాచరణను ఈ రోజు నిరసనలో ప్రకటించాలని యోచిస్తున్నారు. ఇక సోమవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి, నిర్మాతలు, ఫెడరేషన్ నేతల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం ఫలితంపై టాలీవుడ్ భవిష్యత్ షెడ్యూల్ ఆధారపడి ఉంది.

అయితే, ఇప్పటివరకు జరిగిన చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు నిర్మాతలు 4 ప్రతిపాదనలు ఉంచారు. వాటికి అంగీకారం తెలిపితే వారు కోరిని 30 శాతం జీతం పెంపు అనే అంశంపై ఒక క్లారిటీ రావచ్చు. జీతాల పెంపు అంశంపై మంత్రి కోమటిరెడ్డి, చిరంజీవిని కలుస్తామని ఫెడరేషన్ నాయకులు తెలిపారు.

నిర్మాతల 4 ప్రతిపాదనలు ఇవే..

•కార్మికులు ఖచ్చితమైన కాల్ షీట్లు ఇవ్వాలి. పని వేళలు (6Am to 6Pm, 9Am to 9Pm) ఒక షెడ్యూల్ కు కట్టుబడి ఉండాలి.

•ఇక్కడ సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్ తో కూడా వర్క్ చేయించుకుంటాం (స్కిల్ ఆధారంగా, వేరే రాష్ట్రాల వారితో పని చేయించుకోవటం)

•వ్యక్తిగత షూటింగ్ ఎక్కడ జరిగినా హాజరు కావాలి. దూరం అనే అంశాన్ని తీసుకురావద్దు.

•ప్రతి నెల రెండో ఆదివారం, పండుగ రోజు (ప్రభుత్వం ప్రకటించిన సెలవులు)లో పనిచేసిన వారికి మాత్రమే డబుల్ కాల్ షీట్ .. మిగిలిన ఆదివారాల్లో సింగిల్ కాల్షిట్ ఉంటుంది.

కార్మికుల నుంచి ప్రధానంగా 2 ప్రతిపాదనలు..

•30 పర్సెంట్ వేతనాలు పెంచాలి

•పెంచిన వేతనాలను ఏరోజుకారోజే చెల్లించాలి.. అని డిమాండ్ చేశారు.

గత 3 ఏళ్లుగా వేతనాలు పెంచలేదు. ఆ 30 శాతం వేతనం ఒకే సారి పెంచమని అడగటం తప్పా...?

పాత ప్రొడ్యూసర్ లతో ఫిలిం ఫెడరేషన్ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని , ఇటీవల వచ్చిన ప్రొడ్యూసర్ , చిన్న సినిమాల ప్రొడ్యూసర్ వలనే ఇబ్బందులు వచ్చాయని , వారికి బడ్జెట్ ప్రాబ్లం మో లేక ఇంకేమైనా ప్రోబ్లెమో తెలీదు కానీ కార్మికులకు ప్రతి సంవత్సరం 10 శాతం వేతనాలు పెంచేవారు. 2022 లో పెంచారు కానీ , గత 3 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదు. ఆ 3 సంవత్సరాల వేతనాలు కలిపి ఒకేసారి 30 శాతం వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నాము. ఒకేసారి 30 శాతం పెంచమని అడుగుతున్నాం అంటున్నారు కానీ 3 సంవత్సరాల నుండి ఆపేసి, కాలయాపన చేసింది మాత్రం యూనియన్ గుర్తించడం లేదు అని ఫిలిం ఫెడరేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక చిన్న సీన్ చేయాలనుకుని జెనరేటర్ పెట్టాలన్నా యూనియన్ పర్మిషన్ కావాలి. హీరో, ఫ్రెండ్ సీన్ కోసం మేకప్, కాస్ట్యూమ్స్, వాళ్లకు వడ్డించే ప్రొడక్షన్..ఇలా 80 మందిని పెట్టుకోవాలి. చిన్న నిర్మాతకు ఇంతమందిని పెట్టుకోవడం పెనుభారంగా మారింది. వాస్తవానికి అక్కడ పనిచేసేది ఆరుగురు మాత్రమే. మిగతా వాళ్లకు పేమెంట్స్ ఇవ్వాలి. ఇంత మందిని మా నెత్తిన రుద్దడం ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది అని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు.

యూనియన్స్ పేరుతో మాకు భారాన్ని పెంచవద్దని కోరుతున్నాం. ఈ యూనియన్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి నిబంధనలు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మార్చాలి. తక్కువ మంది తో సరిపోయే షూటింగ్ లో 100, 150 మందిని పెట్టాలని దౌర్జన్యం చేస్తున్నారు. ఒక సెట్ కోసమో, ఇంకో క్వాలిటీ కోసమే మేము పెట్టాల్సిన ఖర్చు ఇలా వృథా అవుతోంది. ఈ బంద్ ల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. యూనియన్స్ రూల్స్ వల్ల మాలాంటి చిన్న నిర్మాతలకు ఇబ్బందిగా ఉంది. నిర్మాతలు, యూనియన్స్ అని సెపరేట్ కాకుండా అందరూ కూర్చుని మాట్లాడుకుంటే ఈ సమస్యలు సాల్వ్ అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు అని తెలిపారు.

సమస్య అనేది 2022 నుంచి ప్రతి సంవత్సరం 10 శాతం పెంచకుండా కాలయాపన చేసి ఊరించారని , ఇటు జీవన ఖర్చులు ( లివింగ్ కాస్ట్ ) అన్ని పెరిగిపోయాయని మా జీతాలు పెంచటం లేదని ఫెడరేషన్ కార్మికులు న్యాయ బద్ధంగా తమ సమస్యను షూటింగ్ లు బంద్ చేసి నిరసన తెలుపుతున్నారు. ఒకేసారి 30 శాతం వేతనాలు పెంచాలంటే , దానితో పాటు వివిధ సమస్యలు చిన్న నిర్మాతలు , పెద్ద నిర్మాతలు జరిగే పని కాదని పెంచలేము అన్నట్టు చెబుతున్నారు. ఈ సమస్య పై ప్రభుత్వం తో కలిసి సినీ పెద్దలు , ఫెడరేషన్ నాయకులు , ప్రొడ్యూసర్ యూనియన్ పెద్దలు అందరూ ఒకే తాటి మీదకు వస్తే తప్ప సమస్య పరిష్కారం అయ్యేటట్లు తెలియటంలేదు. ఇంకా అటు ఆంధ్రా లో , ఇటు తెలంగాణ ప్రభుత్వం తో సినీ పెద్దలు నిర్మాతలు సమావేశాలు జరుపుతున్నారు. ఇంకా సమస్య కొలిక్కి రాలేదనే తెలుస్తుంది. వేచి చూడాలి కార్మికులకు ఎంత శాతం వేతనాలు పెంచుతారో..

Next Story