- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ టెండర్లలో రింగ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ టెండర్లలో బిడ్ దాఖలు చేసిన ఇంజినీరింగ్ కాలేజీలు రింగ్ అయ్యాయి.

దిశ, సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ టెండర్లలో బిడ్ దాఖలు చేసిన ఇంజినీరింగ్ కాలేజీలు రింగ్ అయ్యాయి. అన్ని కాలేజీల ప్రతినిధులు ముందస్తుగానే సిండికేట్ అయ్యారు. దీంతో అన్ని కాలేజీలు 0.5 శాతానికి బిడ్ దాఖలు చేశాయి. అయితే రూ.5 లక్షల కన్నా ఎక్కువ విలువైన పనుల్లో నాణ్యత ప్రమాణాలను చెక్ చేయడానికి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఆరు జోన్లు 30 ఇంజినీరింగ్ డివిజన్లకు సంబంధించిన పనులను చెక్ చేయాల్సి ఉంటుంది. సిమెంట్ కాంక్రీట్ పేవ్‌మెంట్స్, బీటీ రోడ్డు పనులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, వరదనీటి కాలువలు, ఆర్సీసీ బిల్డింగ్స్, కల్వర్డులు, బ్రిడ్జీలు, ఫుట్‌పాత్, ఇతర సివిల్ పనులను చెక్ చేయడానికి ఏజెన్సీలను నియమించుకోనున్నారు. అయితే ఈ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ టెండర్లలో సీఆర్ఎంపీ, ఎస్ఎన్డీపీ, హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధం లేదు. వీటికి ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్ కన్సల్టెన్సీ (పీఎంసీ) నియమించుకోవాల్సి ఉంటుంది.
లక్ష్యం పక్కదారి
జీహెచ్ఎంసీ పరిధిలో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పనులను సైతం కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇచ్చేవారు. జనార్దన్ రెడ్డి కమిషనర్‌గా ఉన్న సమయంలో థర్ద్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సేవలను ఇంజినీరింగ్ కాలేజీలను ఇవ్వాలని నిర్ణయించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ చదివిన విద్యార్థులకు ప్రాక్టికల్స్‌తో పాటు ప్రాజెక్టు వర్క్‌కు ఉపయోగపడేవిధంగా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఉండాలని నిర్ణయించారు. ఇంజినీరింగ్ కాలేజీలు టెండర్లు దక్కించుకుంటున్నాయి తప్ప క్వాలిటీ కంట్రోల్ పనులన్నింటిని కాంట్రాక్టర్లకు చెందినవారే చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.
11 కాలేజీలు..12 స్లైస్‌లు
విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, ఐఐటీ, ఎన్ఐటీ, రీసెర్చ్అండ్ డెవలప్‌మెంట్ సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. అయితే జీహెచ్ఎంసీ పరిధికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి. పదేండ్లుగా అనుభవం ఉండాలి. సదరు కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ తప్పనిసరిగా ఉండడం, ఏఐసీటీఈ గుర్తింపుతోపాటు ఏదైనా ప్రభుత్వం యూనివర్సిటీకి అనుబంధంగా ఉండాలి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు పొంది ఉండాలి. అయితే ఈ టెండర్లకు జేఎన్టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలు దూరంగా ఉన్నాయి. ఇక మిగిలిన 11 కాలేజీల్లో మాత్రమే సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. కానీ జీహెచ్ఎంసీ 12 స్లైస్‌లకు టెండర్లను ఆహ్వానించింది.
సిండికేట్‌గా..
12 స్లైస్‌లకు ఆహ్వానించిన టెండర్లలో 11 ఇంజినీరింగ్ కాలేజీలు 0.4 నుంచి 0.5శాతం లోపే బిడ్ దాఖలు చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి న్యాక్, ఎన్బీఏ గుర్తింపు కోసమే తప్ప, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పనులు చేయాలనే ఉద్దేశం లేదని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పైగా ఏజెన్సీలకు ప్రాజెక్టు వ్యయంలో నుంచే ఫీజు చెల్లించాల్సి ఉంది. సిండికేట్ కావడంతో 0.5 శాతానికి పరిమితం కావాల్సి వస్తుందని, దీంతో తమ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని పలు ఇంజినీరింగ్ కాలేజీల ప్రతినిధులు వాపోతున్నారు. దీంతోపాటు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్‌లో భాగంగా సీసీ రోడ్డు కోర్ కటింగ్ టెస్ట్‌లు చేయడానికి చాలా కాలేజీల్లో పరికరాలు లేవనే విమర్శలూ ఉన్నాయి. ఈ టెస్ట్ చేయడానికి మరో ఏజెన్సీకి ఇవ్వాల్సిందేనని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
నాణ్యత ప్రమాణాలు గాలికి
జీహెచ్ఎంసీ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీలకు కాంట్రాక్టర్లు చేపట్టే పనుల్లో నుంచే ఫీజు చెల్లిస్తున్నారు. దీంతో క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ చేయకుండానే బిల్లులు మంజూరు చేస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. ఫలితంగా చాలా ప్రాంతాల్లో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ ఇచ్చే రిపోర్డు లేకుండానే బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇంజినీరింగ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.






