కేంద్ర ఎన్నికల కమిషన్ తో నరేంద్ర మోడీ సర్కార్ కుమ్మక్కు

by Disha Web Desk 15 |
కేంద్ర ఎన్నికల కమిషన్ తో నరేంద్ర మోడీ సర్కార్ కుమ్మక్కు
X

దిశ, హిమాయత్ నగర్ : ఈవీఎం టాంపరింగ్ ద్వారా ఎంపీ ఎన్నికల్లో గెలవడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తో నరేంద్ర మోడీ సర్కార్ కుమ్మక్కు అయిందని దళిత బహుజన పార్టీ (డీబీపీ) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ ఆరోపించారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ.. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి 400 ఎంపీ సీట్లు వస్తున్నాయని తక్షణమే డాక్టర్. అంబేద్కర్ రూపొందించిన సోషల్ జస్టిస్ రాజ్యాంగంను రద్దు చేస్తామని ఆ పార్టీ ఎంపీ హెగ్డే ద్వారా ప్రకటనలు ఇప్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈవీఎం టాంపరింగ్ కి సహకరించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గొయల్ మీద ఒత్తిడి తీసుకొచ్చినందువల్లే ఆయన రాజీనామా చేశారన్నారు.

ఈవీఎం ద్వారా లోక్ సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు వేసిన ఓటుకు తీర్పుకు ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ఓటు హక్కు దుర్వినియోగం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవీఎంల ద్వారానే నిర్వహించగలమని ఈసీఐ అధికారులు ప్రకటించడం వెనుక కుట్రలు దాగి ఉన్నాయని తెలిపారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ అడ్వకేట్లు పలు రాజకీయ పార్టీలు ప్రజా సంస్థలు, మేధావులు, పౌర సంఘాలు.. ఎన్నికల

వాచ్ సంస్థలు పెద్ద ఎత్తున గళం వినిపిస్తున్నాయని, కానీ ఈసీఐ పట్టించు కోకుండా బీజేపీతో కుమ్మక్కు అయి ఏక పక్షంగా ముందుకు వెళ్తున్నారని కృష్ణ స్వరూప్ ఆరోపించారు. ఇప్పటికైనా లోక్ సభ, ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎం లతో కాకుండా బ్యాలట్ తో నిర్వహించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు షేక్ బాషా, బీరం సతీష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇటికాల గణేష్, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఇ.శంబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story