హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

by Bhanu |

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ మారుతి నగర్‌లో హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు జావ్వాజీ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
X

దిశ, చైతన్యపురి : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ మారుతి నగర్‌లో హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు జావ్వాజీ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 21న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ జి. వెంకటేశ్వర్ రావు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన కామాక్షేశ్వరి వైష్ణవి అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. ఆమె అల్లుడు జావ్వాజీ కృష్ణ అదే రోజు ఆమెను కలవడానికి వచ్చాడు. అపార్ట్‌మెంట్ బయట కృష్ణ తన కారును పార్క్ చేయగా, వెనక నుంచి గండ్ర నాగిరెడ్డి తన వాహనాన్ని పార్క్ చేయాలనుకున్నాడు.

కారు గీతలు పడినట్టు భావించిన కృష్ణ, వాచ్‌మెన్ ద్వారా నాగిరెడ్డిని పిలిపించి, మాటా మాట పెరిగి తీవ్రంగా దాడికి దిగాడు. ఈ దాడిలో నాగిరెడ్డి చెవికి తీవ్ర గాయం అయి, రక్తస్రావం కొనసాగింది. పక్కనున్న వారు మధ్యలో వచ్చి మధ్యవర్తిత్వం చేసినా, గాయాలు తీవ్రమవడంతో నాగిరెడ్డిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పరారీలో ఉన్న కృష్ణను నాగోల్‌లోని జైపురి కాలనీలో అతని నివాసంలో బుధవారం అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు.

Next Story