వారి త్యాగాలకు అవమానం: ఎంపీ ఈటల తీవ్ర ఆవేదన

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర సీఎం రేవంత్​రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని పెద్దన్నగా పొగడ్తలో ముంచేసి, గల్లీకి వచ్చి తరువాత అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్​ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారి త్యాగాలకు అవమానం: ఎంపీ ఈటల తీవ్ర ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సీఎం రేవంత్​రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని పెద్దన్నగా పొగడ్తలో ముంచేసి, గల్లీకి వచ్చి తరువాత అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్​ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆశలను, బీఆర్​ఎస్​, కాంగ్రెస్​వమ్ము చేశాయని, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అప్పలు ఊబిలో ఉన్న రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మారడం తథ్యమన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ తాను మాజీ మంత్రి హరీష్​రావు ను కలిసినట్లు కాంగ్రెస్​చేసిన విమర్శలు సరికావని, ఆయనను కలివాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు. గత పాలనలో జరిగిన ఫోన్​ట్యాపింగ్​కేసు ఏమైందని నిలదీశారు. కేసీఆర్​కుటుంబ అవినీతి చేసిందని విమర్శలు చేసే కాంగ్రెస్​నేతలు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. తెలంగాణ కంటే ఏపీ జీడిపీ, ఆదాయం తక్కువగా ఉందని, ప్రధాని మోడీ సహకారంతో ఏపీ అద్భుతంగా అభివృద్ది చెందుతుంటే తెలంగాణ వెలవెల బోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిని అమర వీరుల కుటుంబాలకు ఇచ్చిన ఒక హమీ అమలు చేయలేదని మండిపడ్డారు. నేడు జరుపుకునే తెలంగాణ అవతరణ దినోత్సవ సంబురాలు మూడు తరాల ఉద్యమం, కొన్ని వేల వేల మంది బలిదానాల తర్వాత, త్యాగాలతో నిండిన ఉద్యమించిన ఫలితమే అన్నారు. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం హైదరాబాద్‌లో సిటీ కాలేజ్ దగ్గర ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంతో మొదలైందని, ఆనాటి నిరంకుశ పాలకులు కాల్పలకు ఏడుగురు విద్యార్థులు అమరులయ్యారు. తరువాత ఉద్యమానికి నాయకత్వం వహించిన చెన్నా రెడ్డి 1969లో మా ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పి యావత్ తెలంగాణ కోసం ఉద్యమించారు. ఆనాడు ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉద్యమంపై ఉక్కుపాదం మోపి 369 మంది విద్యార్థులను బలిగొన్న నీచమైన చరిత్ర తెలంగాణ సమాజం మర్చిపోదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేమే ఇచ్చామని చెప్పుకుంటోందని నిజంగా ఇవ్వాలనే గుండె ఉంటే అప్పుడే ఇచ్చేవారని పేర్కొన్నారు. జయశంకర్ లాంటి మేధావులు ఉద్యమాన్ని రగిలించుతూ దీపం ఆరకుండా కాపలా కాశారని, మలిదశ ఉద్యమానికి ముందు కాకినాడ తీర్మానం ద్వారా బీజేపీ రెండు రాష్ట్రాల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి జీవం పోసిందన్నారు. సుష్మా స్వరాజ్ తెలంగాణ చిన్నమ్మగా పిలవబడుతూ, యాదగిరి రెడ్డి చనిపోయినప్పుడు మీరు చావకండి, మేము ఉన్నాం, వి ఆర్ విత్ యు అని చెప్పిన భరోసా మరువలేమన్నారు. బీజేపీ నిజాయితీగా మద్దతు చేసినందుకే తెలంగాణ ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త శాఖల పేరుతో కొత్త పద్ధతులకు తెరలేపింది. కానీ, నిధులు, నీళ్ళు, ఉద్యోగాల కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలకు అవమానం జరుగుతోందన్నారు. నేడు ఉప్పు పుట్టకుండా మోరల్ కరేజ్ మీద దెబ్బతీసిన కాంగ్రెస్‌తో రాష్ట్రం తిరోగమనంలోకి వెళుతోందని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story