- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఎస్‌బీలో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభం
ఐఎస్‌బీ కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదని, తెలంగాణకు వ్యూహాత్మక భాగస్వామి అని, పాలసీల రూపకల్పనలో పరిశోధనల

దిశ, శేరిలింగంపల్లి : ఐఎస్‌బీ కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదని, తెలంగాణకు వ్యూహాత్మక భాగస్వామి అని, పాలసీల రూపకల్పనలో పరిశోధనల ద్వారా ప్రభావం చూపడంలో ఐఎస్‌బీ నిరూపిత ట్రాక్ రికార్డు కలిగి ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. శుక్రవారం ఐఎస్‌బీ హైదరాబాద్ క్యాంపస్‌లో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ ఆధునిక సెంటర్ ద్వారా ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, లీడర్‌షిప్ ప్రోగ్రామ్స్ అకాడెమియా-ఇండస్ట్రీల మధ్య సంబంధాలను మరింత బలపరచనుంది. ఈ సెంటర్ స్థాపనకు మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ నుండి రూ.100 కోట్ల విరాళం లభించడం ఒక మైలురాయిగా నిలిచింది. ప్రారంభోత్సవ అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆరోగ్య అధికారులకు శిక్షణ ఇవ్వడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టడీస్ నిర్వహించడం వంటి అంశాలలో వారి సహకారం చాలా విలువైనదని చెప్పారు.
నిజమైన మార్పు అనేది ప్రభుత్వం పాలసీ, ఇండస్ట్రీ వనరులు, అకాడెమియా జ్ఞానం పరిశోధనను అందించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ నిజంగా ఒక ఆకాంక్ష, ఆశయాల ప్రతీక అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదని, దూరదృష్టి కలిగిన ఫిలాంత్రఫీ ద్వారా నిర్మించబడిన లెర్నింగ్ గేట్వే అని అన్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ మద్దతు కేవలం దానం మాత్రమే కాదని, జ్ఞానం, నాయకత్వం సమిష్టి ప్రగతిపై విశ్వాసానికి ప్రతీక అని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. ఈ సెంటర్ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం చూపే వ్యక్తులు తయారవుతారని అన్నారు. వారు భారత్ పేరు గర్వంగా నిలబెట్టే విధంగా పనిచేస్తారని, విద్య, వ్యాపారం, పరిపాలనల మిళితంగా సార్థకమైన మార్పు తీసుకురావడానికి ఈ సదుపాయం సహకరిస్తుందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం విద్య నైపుణ్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ 104 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఉమెన్స్ యూనివర్సిటీ వంటి పలు కార్యక్రమాలు చేపడుతోందని గుర్తు చేశారు. ఇవన్నీ కలిసి 2047 నాటికి తెలంగాణ రూ.3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక దృష్టిని నెరవేర్చే నాయకులను తీర్చిదిద్దుతాయని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ఛైర్మన్ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ.. లెర్న్, ఎర్న్ అండ్ రిటర్న్ అనేది మా తత్వం అని, విద్య ద్వారానే అవకాశాలు సృష్టించబడతాయని, భవిష్యత్తులు నిర్మించబడతాయని అన్నారు. ఈ సెంటర్ ద్వారా కొత్త తరానికి జ్ఞానం, విలువలు, నూతన నాయకత్వాన్ని అందించడం మా లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్టీ రామ్‌దేవ్ అగర్వాల్, ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిళ్ళుట్ల తదితరులు పాల్గొన్నారు.






