- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దమ్మ తల్లి ఆలయ భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టే యత్నం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి ఆలయ భూములను(Peddamma Thalli Temple Land) కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Shravan Dasoju) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి ఆలయ భూములను(Peddamma Thalli Temple Land) కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Shravan Dasoju) ఆరోపించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో 12 ఎకరాల్లో ఉన్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొంతమంది అధికారంలో ఉన్న నాయకులు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థల యజమాన్యాలతో కుమ్మక్కై, వారికి అప్పనంగా కట్టబెట్టే కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా దాదాపు 60, 70 సంవత్సరాల నుండి అక్కడ నెలకొని ఉన్న పెద్దమ్మతల్లి ఆలయాన్ని అత్యంత దుర్మార్గంగా విధ్వంసం చేసి, అందులో నెలకొని ఉన్న అద్భుతమైన పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని అగౌరవపరుస్తూ, ధార్మిక నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తొలగించి, ఫిలింనగర్ లో ఉన్న ఒక చిన్న ఆలయంలో పడేసి తమ రాక్షసత్వాన్ని ప్రకటించుకున్నారన్నారు.
అంతేకాకుండా ఆ గుడిని విధ్వంసం చేసి, గుడి చుట్టూ ఉన్న స్థలాన్ని అక్రమంగా ఆక్రమించాలనే యత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ దుశ్చర్యలను అడ్డుకునేందుకు స్థానిక ప్రజలతో కలసి పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సత్యాన్ని కప్పిపుచ్చలేరని అన్నారు. పెద్దమ్మతల్లి గుడి స్థానిక ప్రజల విశ్వాసానికి ప్రతీక అని, దాన్ని కబ్జా చేయాలన్న కుట్రలను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్నారు. గుడి తిరిగి నిర్మాణం పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి అహర్నిశలు పోరాడుతుందని, అక్రమ నిర్బంధాలతో పాలన సాగించలేరని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించాలని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని, అప్పనంగా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కట్టబెట్టొద్దని డిమాండ్ చేశారు. ఆ స్థలంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని, ప్రభుత్వాసుపత్రిని నిర్మించాలని ఇంకా విద్య నిమిత్తం మంచి ప్రభుత్వ స్కూలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమి ప్రజలది ప్రజల భవిష్యత్తు అవసరాలది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపార ధోరణి విడనాడి ప్రజాహితంగా పనిచేయాలని, పెద్దమ్మ తల్లి గుడి పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు.






