కాదేది చోరీకి అనర్హం.. సెంట్రింగ్ ప్యానెల్స్ చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్

by Bhanu |   (  Updated:2025-05-01 09:46:09  IST  )

నూతన నిర్మాణాలలో సెంట్రింగ్ కు ఉపయోగించే అల్యూమినియం ప్యానెల్స్ ను దొంగతనం చేస్తున్న 7 మంది సభ్యుల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కాదేది చోరీకి అనర్హం.. సెంట్రింగ్ ప్యానెల్స్ చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి : నూతన నిర్మాణాలలో సెంట్రింగ్ కు ఉపయోగించే అల్యూమినియం ప్యానెల్స్ ను దొంగతనం చేస్తున్న 7 మంది సభ్యుల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చోరీ కేసుకు సంబంధించిన వివరాలను మియాపూర్ సీఐ క్రాంతి కుమార్, డీఐ రమేష్ నాయుడుతో కలిసి మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మీడియాకు వివరించారు. దేవరకొండ ప్రాంతానికి చెందిన ముడావత్ పద్మ (35), మహబూబ్ నగర్ అచ్చంపేటకు చెందిన నేనావత్ విజయ (35), మహబూబ్ నగర్ చింతలకుంట ప్రాంతానికి చెందిన బిలావత్ లక్ష్మీ (41), దేవరకొండ చిత్రాలకు చెందిన నేనావత్ అమృత (25), నాగర్ కర్నూలు ఘనపూర్ కు చెందిన సబావత్ సునీత (28), నాగర్ కర్నూల్ అచ్చంపేటకు చెందిన వాదిత్య అనిత (22), దేవరకొండ చిత్రాల బుద్దనూర్ తండాకు చెందిన నేనావత్ చందర్ (26) వీరంతా ఆయా ప్రాంతాల నుండి జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చి సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నూతన నిర్మాణాలలో సెంట్రింగ్ కు ఉపయోగించే అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ దొంగతనానికి పాల్పడుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో గత నెల 19వ తేదీన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్స్ వద్ద అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ చోరీకి గురయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీఐ రమేష్ నాయుడు, సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో 6 మంది ఆడవారు ఉండగా, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా కలిసి ముఠాగా ఏర్పడి అల్యూమినియం ప్యానెల్స్ దొంగతనం చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

నల్గొండ జిల్లా దిండికి చెందిన వీరు సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉంటూ 2010వ సంవత్సరం నుండి నగర వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి రూ.7 లక్షల విలువైన రెండు ఆటోలు, అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీలకు పాల్పడుతున్న డావత్ పద్మ మీద 2011 నుండి ఇప్పటి వరకు ఆయా పోలీసు స్టేషన్లలో 16 కేసులు నమోదు కాగా నేనావత్ విజయ మీద 2010 నుండి ఇప్పటి వరకు 9 కేసులు నమోదు అయ్యాయి. బిలావత్ లక్ష్మీ మీద 2010 నుండి 7 కేసులు, సబావత్ సునీత మీద 2 కేసులు, చందర్ మీద రెండు కేసులు, వడిత్య అనిత, అమృత మీద ఒక్కో కేసు నమోదు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు వారిని గురువారం రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మియాపూర్ సీఐ క్రాంతి కుమార్, డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ రమేష్ నాయుడు, కానిస్టేబుళ్లు మల్సూర్, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, పూల్య నాయక్, సుభాష్ చంద్రబోస్, పూర్ణచందర్, సాయికృష్ణ, ఉమెన్ కానిస్టేబుల్ స్వప్నను మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ అభినందించారు.


Next Story