హైదరాబాద్ గ్లోబల్ సిటీలో మెట్రోరైలే కీలకం : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి

by Muthe.Rajitha |

హైదరాబాద్ ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా హైదరాబాద్ లో మెట్రో రైల్ వ్యవస్థను నలుదిక్కులా విస్తరిస్తున్నట్టు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్(హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ గ్లోబల్ సిటీలో మెట్రోరైలే కీలకం : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
X

దిశ, సిటీ బ్యూరో : హైదరాబాద్ ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా హైదరాబాద్ లో మెట్రో రైల్ వ్యవస్థను నలుదిక్కులా విస్తరిస్తున్నట్టు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్(హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 69 కిలోమీటర్ల తొలి అడుగుతో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోని దాదాపు 200 కిలోమీటర్లకుపైగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈవీ జిప్ సంస్థ హైదరాబాద్ లో ‘మొదటి - చివరి మైల్ కనెక్టివిటీ’ లో భాగంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, క్యాబ్ లను ఎల్ ఎండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డితో కలిసి ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఈవీ జిప్ తో సహా ఇప్పటి వరకు 9 సంస్థలు ‘మొదటి - చివరి మైల్ కనెక్టివిటీ’ కింద తమ సేవలు అందిస్తున్నాయని చెప్పారు.

రోజూ మెట్రో రైల్ లో ప్రయాణం చేస్తున్న సుమారు 5 లక్షల మందిలో 1.25 లక్షల మందిని ఈ సంస్థల వాహనాలు వారి వారి గమ్యాలకు చేరుస్తున్నాయని తెలిపారు. వీటిలో మహిళా ప్రయాణీకుల కోసం కూడా ప్రత్యేకంగా మహిళలే నడిపే ద్విచక్ర ఎలెక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు తొలిసారిగా ‘ఈవీ జిప్ ఈషా’ పేరున వారు ప్రవేశపెట్టడం జరిగిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఈ వాహనాలను వందకు పైగా పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్ల నుండి మల్కాజ్ గిరి, సైనిక్ పురి, ఈసీఐఎల్ వంటి ప్రాంతాలకు ఎక్కువగా నడుపుతున్నారని, వీటిని త్వరలోనే ఇతర స్టేషన్లకు, ప్రాంతాలకు విస్తరిస్తారని ఆయన తెలిపారు. హైదరాబాద్ ని ప్రపంచ నగరాలకు దీటుగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతను అందిపుచ్చుకుని మెట్రో రైల్ ని విస్తరిస్తున్నామని ఆయన చెప్పారు.

ఇప్పటికే పాత నగరంలో ఎంజీబీఎస్ నుండి చంద్రాయణ్ గుట్ట వరకు ప్రారంభించిన రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మొత్తం ప్రభావిత 1100 ఆస్తులకుగాను 170 ఆస్తులకు నష్టపరిహారం రు.80 కోట్లు చెల్లించామని వెల్లడించారు. వచ్చే కొద్ది రోజుల్లో మరో 80 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేలా ప్రభావిత ఆస్తుల ఓనర్షిప్ డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతోందని ఆయన అన్నారు. పరిహారం చెల్లించిన ప్రభావిత ఆస్తుల కూల్చివేత్తలు కూడా జోరుగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. మొత్తం 270 మంది యజమానులు ఇప్పటికే స్వచ్ఛందంగా తమ ఆస్తులను మెట్రో రైల్ నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి, సీనియర్ అధికారులు మురళీ వరదరాజన్, రిషి వర్మ, కియోలిస్ మెట్రో ఎండీ ఎస్.సి. మిశ్రా, ఈవీ జిప్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ శివలెంక, సీతారాం చెరుకుపల్లి తదితరులు పాల్గొన్నారు.

Next Story