శిశువు అపహరణ కేసును ఛేదించిన మార్కెట్ పోలీసులు

by Ratna Kumari |

సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు నాలుగు నెలల పసికందు బాలిక అపహరణ కేసును వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

శిశువు అపహరణ కేసును ఛేదించిన మార్కెట్ పోలీసులు
X

దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు నాలుగు నెలల పసికందు బాలిక అపహరణ కేసును వేగంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ వి. రామచందర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 10న‌ రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేస్తున్న బాధితురాలితో పరిచయం పెంచుకున్న ఓ పురుషుడు, ఓ మహిళ ఆహారం, బట్టలు కొనిచ్చి పాట్నీ, బండిమెట్ మార్కెట్ ప్రాంతాలకు తీసుకెళ్లారు. అనంతరం టవల్ కొనుగోలు చేయాలని చెప్పి బాధితురాలిని రోడ్డు దాటమని పంపి, ఆమె వద్ద ఉన్న నాలుగు నెలల పాపను అపహరించి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మార్కెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గోగ వెంకయ్య (30), మునగాల శీరిష (28)లను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎం. బషీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Next Story