సమస్యల సుడిగుండంలో ఏరియా దవాఖాన

by Ajay Maddhiboyina |

నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. పేరుకుపోయిన చెత్తాచెదారంతో పాటు భవనంలో వాటర్ లీకేజీలు, ఓపీ కౌంటర్ వద్ద కరెంట్ షాకులతో రోగులు అవస్థలు పడుతున్నారు.

సమస్యల సుడిగుండంలో ఏరియా దవాఖాన
X

దిశ, కార్వాన్ : నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. పేరుకుపోయిన చెత్తాచెదారంతో పాటు భవనంలో వాటర్ లీకేజీలు, ఓపీ కౌంటర్ వద్ద కరెంట్ షాకులతో రోగులు అవస్థలు పడుతున్నారు. 100 పడకల సామర్థ్యం ఉన్న నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో సాధారణ ఓపీ, ఐపీ అత్యవసర సేవలను వైద్యులు అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ పరిధిలోని ఈ ఆసుపత్రికి ప్రతి రోజూ దాదాపు 600 నుంచి 800 వరకు ఔట్ పేషెంట్ చికిత్స కోసం వచ్చిపోతుంటారని సమాచారం. అలా వచ్చిన రోగులను వైద్యులు పరీక్షించి అవసరమైతే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని వైద్యం అందిస్తారు.

రాజ్యమేలుతున్న సమస్యలు..

ఆసుపత్రిలో సమస్యలు రాజ్య మేలుతున్నాయి. పేరుకుపోయిన చెత్త, ఆసుపత్రి భవనంలో వాటర్ లీకేజీలు, మరో పక్క ఓపీ కౌంటర్ మరమ్మతులకు నోచుకోకపోవడంతో కరెంట్ షాకులతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. పట్టించుకోవాల్సిన వైద్యాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రోగుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.

కరెంట్ షాకులతో అవస్థలు..

నిత్యం వందల సంఖ్యలో ఓపీ కౌంటర్ వద్ద రోగులు గంటల తరబడి నిల్చొని ఆధార్ కార్డు ధ్రువీకరించి ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఔట్ పేషెంట్ క్యూలో నిల్చుంటారు. ఓపీ కౌంటర్ వద్ద ఉన్న గ్రిల్స్‌లో కరెంట్‌కు సంబంధించిన వైర్ కనెక్షన్‌లో సాంకేతిక లోపం వల్ల క్యూలైన్లో నిలుచున్న రోగులకు నిత్యం ఎర్తింగ్ వచ్చి కరెంట్ షాకులు తగులుతున్నాయని వాపోతున్నారు. మరమ్మతులు చేయించాల్సిన వైద్యాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉత్పన్నమవుతున్నాయి.

పేరుకుపోయిన చెత్తాచెదారం..

ఆసుపత్రి ప్రాంగణంలో చెత్త చెదారం పేరుకు పోయి దుర్గంధం రావడంతో రోగులు ముక్కు, నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వైద్యం కోసం వస్తే లేని రోగాలు అంటుకోవాల్సిన పరిస్థితి ఆసుపత్రిలో ఉందని రోగులు మండి పడుతున్నారు. వీటికి తోడు ఆసుపత్రిలో పారిశుధ్య లోపంతో ఎటు చూసినా పాన్ పరాగ్, కిల్లీ నమిలి ఆసుపత్రి ప్రాంగణంలో ఉమ్మారు దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తుంది. భవనంలోని కొన్ని ప్రాంతాల్లో వాటర్ లీకేజీలు కూడా ఉన్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు చొరవ కల్పించుకొని ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Next Story