ఖానామెట్ భూములు కబ్జా

by velandi.Saikiran |

ఖానామెట్ సర్వే నెంబర్ 41/11 రెవెన్యూ రికార్డుల ప్రకారం.. ఇది నిరుపేదలకు కేటాయించిన అసైన్డ్ భూమి.

ఖానామెట్ భూములు కబ్జా
X

ఖానామెట్ భూములు కబ్జా

- ఆపై ఇనుప కంచె నిర్మాణం

- స్వాధీనంలో ఉన్న వ్యక్తులకు రౌడీల స్వైర విహారం బెదిరింపులు

- చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

దిశ, శేరిలింగంపల్లి : ఖానామెట్ సర్వే నెంబర్ 41/11 రెవెన్యూ రికార్డుల ప్రకారం.. ఇది నిరుపేదలకు కేటాయించిన అసైన్డ్ భూమి. ఈ భూమిని కబ్జా చేసేందుకు రాజకీయ అండతో కొంతమంది చెలరేగిపోతున్నారు. రౌడీ మూకలతో స్వైర విహారం చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానామేట్‌లో శుక్రవారం పట్టపగలే రౌడీ మూకలు రెచ్చిపోయారు. మూడు వేల గజాల స్థలంలో అప్పటివరకు స్వాధీనంలో ఉన్న వ్యక్తులను భయబ్రాంతులకు గురిచేశారు. మొత్తం స్థలాన్ని స్వాధీనం చేసుకొని చుట్టూ ఇనుప రేకులతో కంచె నిర్మాణం జరుగుతుండగా.. ఇరువర్గాలు భారీగా అనుచరులను మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు సమాచారం అందించడంతో భారీగా పోలీస్ బలగాలు చేరుకొని అక్కడున్న రౌడీ మూకలను వెళ్లగొట్టారు. దీంతో ప్లాట్ యజమానులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదీ నేపథ్యం..

ఖానామెట్ సర్వే నెంబర్ 44/11లో వందలాది ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. ఎకరాకు కోట్ల రూపాయలు పలుకుతున్నది. ఖానామెట్ సర్వే నెంబర్ 41/11లో ఉన్న భూములను 1961లో పలువురికి అసైన్ చేశారు. చాలాకాలం సాగుచేసుకున్న లబ్ధిదారులు కాలక్రమంలో వాటిని అమ్ముకున్నారు. మరి కొంతమంది లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేసి వెళ్లగొట్టారు.

ఇలా ఆ భూములను చేజిక్కించుకున్న కొందరు నిర్మాణాలు చేపట్టి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ భూములపై చాలాకాలంగా వివాదాలు సాగుతున్నాయి. అసైనీల వద్ద తామే ముందు కొనుగోలు చేశామంటే, కాదు మేము జీపీఏ చేయించుకున్నామని చెబుతూ కొందరు అసైన్డ్ భూముల్లో పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేస్తూ నిర్మాణాలు సాగిస్తున్నారు.

తమదేనంటూ బెదిరింపులు..

మెయిన్ రోడ్డు ప్లాట్ కావడంతో వెనుక ఉన్న స్థలాన్ని చూపించి ఇదంతా తమదే అంటూ ఇక్కడ హైరిచ్ బిల్డింగులు నిర్మిస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఓ వ్యక్తి ఫోన్‌లలో నేరుగా బెదిరించాడు. తానొక్కడినే రంగంలోకి దిగితే వర్కౌట్ కాదని మిగతా వారు ఊరుకోరని ఇంకొందరిని అందులో భాగస్వాములుగా చేర్చాడు. అలా ఈ భూమిని విజయవంతంగా చేజిక్కించుకున్నారు. రెవెన్యూ అధికారులు తమకేమి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో తహశీల్దార్ 22ఏలో చూపించారు. అంటే అనన్నీ ప్రభుత్వ భూములు అని దానర్థం. కానీ అసైన్డ్ భూములుగా పేర్కొన్న స్థలం చుట్టూ రాబంధులు చేరారు. తాజాగా స్థలం తమదని ఓ వర్గం బౌన్సర్లను మొహరించి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. గతంలోనే తాము కొనుగోలు చేసినట్లు ఎల్ఆర్ఎస్ కట్టానని చెప్పి మరొకరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు.

రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే.. వారి వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయంటూ చెబుతున్నారు. అక్కడ జరుగుతున్న భూ వివాదాలకు, ఘర్షణలకు రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుండగా, రౌడీలు స్వైర విహారం చేస్తున్నా పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం మరిన్ని ఘర్షణలకు ఆజ్యం పోసే అవకాశం ఉంది.

Next Story