- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోచింగ్ సెంటర్లలో అక్రమాలు.. పట్టించుకోని అధికారులు
గ్రేటర్ హైదరాబాద్‌లో విచ్చల విడిగా కోచింగ్, అకాడమీ సెంటర్లు వెలుస్తున్నాయి.

అనుమతి నిల్.. ఫీజులు ఫుల్
- నగరంలో విచ్చలవిడిగా అనుమతులు లేని కోచింగ్ సెంటర్లు
- ర్యాంకుల కోసం విద్యార్థులపై మానసిక ఒత్తిడి
- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
దిశ, హైదరాబాద్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో విచ్చల విడిగా కోచింగ్, అకాడమీ సెంటర్లు వెలుస్తున్నాయి. ప్రస్తుతం చదువుకు ఉన్న ప్రాముఖ్యతను అడ్డుపెట్టుకొని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలను ఫీజుల రూపంలో గుంజుతున్నాయి. భవనాలను అద్దెకు తీసుకొని ఎలాంటి అనుమతులు లేకుండానే ఏర్పాటు చేస్తున్న వీటితో విద్యార్థులు ఎంతో విలువైన తమ భవిష్యత్‌ను నష్టపోతున్నారు. అనుభవజ్ఞలైన ట్యూటర్లు తమ వద్ద ఉన్నారంటూ ఆకర్షణీయమైన పేర్లతో బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కరపత్రాలు, సోషల్ మీడియాలను ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. వీటి ఆధారంగా చేరిన విద్యార్థులకు మాత్రం టాయిలెట్లు, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ వంటి కనీస వసతులు కూడా కల్పించడం లేదు. చాలా కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నప్పటికీ విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తమ కండ్ల ముందే ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
వ్యాపారంగా విద్య..
హైదరాబాద్ వంటి మెట్రో సిటీలో విద్య వ్యాపారంగా మారింది. పిల్లలు నర్సరీ చదువుకు వచ్చిన నాటి నుంచే తల్లిదండ్రుల కష్టాలు మొదలవుతున్నాయి. పాఠశాలల్లో ప్రవేశాల కోసం లక్షలాది రూపాయల డొనేషన్లు, ఫీజుల రూపంలో చెల్లించాల్సి వస్తుండడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. ఇక వారి చదువు పూర్తయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో కోచింగ్ సెంటర్ల శిక్షణ పేరుతో అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. అనుమతులు లేకుండానే వీటిని ఏర్పాటు చేస్తూ ఇందులో చేరిన వారిని 24 గంటలు హాస్టళ్లలో ఉంచుతూ వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ర్యాంకుల పేరుతో వారిని హింసిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చేస్తున్న మానసక ఒత్తిడి కారణంగా కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడుతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇట్లే అర్థం చేసుకోవచ్చు.
అనుమతులు లేకుండానే..
గ్రేటర్ హైదరాబాద్‌లో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటి ఏర్పాటుకు జీహెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. విద్యా శాఖ నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఏర్పాటు చేసే వాటిపై దాడులు చేసి సీజ్ చేసే అధికారం విద్యాశాఖ అధికారులకు ఉంది. వీరిచ్చే మామూళ్లకు అలవాటు పడుతున్న అధికారులు వీటి గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉంది. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసినట్లు అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు . ఈ విషయమై డీఈవో రోహిణిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆమె అందుబాటులోకి రాలేదు .
చర్యల కోసం అధికారులకు ఫిర్యాదు..
హైదరాబాద్ వ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజావాణిలో కలెక్టర్‌కు, డీఈఓల దృష్టికి సైతం తీసుకెళ్లారు. పలు కోచింగ్ సెంటర్లకు ఉన్న అనుమతులపై ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా ఫలితం లేకుండా పోతున్నది. అధికారులు ఎలాంటి జవాబు ఇవ్వడం లేదు . వీటిని అధికారులు తనిఖీ చేసి అనుమతులు లేకుండా నడిపిస్తున్న కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, అకాడమీలు మొదలైన వాటిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు అంతటా వినబడుతున్నాయి.






