ఒడిశా నుంచి సికింద్రాబాద్ కు గంజాయి అక్ర‌మ ర‌వాణా

by Ratna Kumari |

సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, రైల్వే రక్షణ దళం సంయుక్తంగా చేపట్టిన ఆకస్మిక తనిఖీలలో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా గ్యాంగ్‌ను భగ్నం చేశారు.

ఒడిశా నుంచి సికింద్రాబాద్ కు గంజాయి అక్ర‌మ ర‌వాణా
X

దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, రైల్వే రక్షణ దళం సంయుక్తంగా చేపట్టిన ఆకస్మిక తనిఖీలలో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా గ్యాంగ్‌ను భగ్నం చేశారు. ఒడిశా లోని బాలుగావ్ నుంచి సికింద్రాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 18.288 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థం విలువ సుమారు రూ. 9,14,400గా అంచనా వేశారు. అరెస్టైన వారిలో అబిషేక్ సింగ్, గోలు సింగ్ (25), ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లా నివాసి, అలాగే అబిషేక్ కుమార్ సింగ్(23), పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉన్నారు. వీరిద్దరూ బంధువులు కాగా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ అక్రమ రవాణాకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు డిగాల్ (ఒడిశా, చిల్కా ప్రాంతం) పరారీలో ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు డిగాల్ సూచనల మేరకు అబిషేక్ సింగ్ భువనేశ్వర్‌లో అతనితో పరిచయం పెంచుకుని, ఒక్కో ట్రిప్‌కు రూ.15,000 చెల్లిస్తానని చెప్పడంతో ఈ అక్రమ రవాణాకు ఒప్పుకున్నాడు. ఫిబ్రవరి 11న బాలుగావ్ రైల్వే స్టేషన్‌లో డిగాల్ రెండు బ్యాగుల్లో 18.288 కిలోల గంజాయిని అందజేసి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాలని ఆదేశించాడు. ఫిబ్రవరి 12న ఉదయం సికింద్రాబాద్ చేరుకున్న అనంతరం జనరల్ వెయిటింగ్ హాల్‌లో ఎదురు చూస్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను రైల్వే పోలీస్ సిబ్బంది, ఆర్పిఎఫ్ సిబ్బంది సంయుక్తంగా, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story