అనుమతులు కొంత...అంతస్తులు కొండంత!

by velandi.Saikiran |   (  Updated:2025-12-02 01:10:13  IST  )

అనుమతులు కొంత.. నిర్మాణాలు భారీగా.. ఇదీ నార్సింగి మున్సిపల్ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారం. జీ ప్లస్ 2,

అనుమతులు కొంత...అంతస్తులు కొండంత!
X

దిశ, గండిపేట: అనుమతులు కొంత.. నిర్మాణాలు భారీగా.. ఇదీ నార్సింగి మున్సిపల్ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారం. జీ ప్లస్ 2, 3 అనుమతులు తీసుకుంటున్న కొందరు నిర్మాణదారులు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా జీ ప్లస్ 7, 8 నిర్మాణాలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నార్సింగి మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాలతో పాటు కోకాపేటలో అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. ఈ వ్యవహారం అంతా మున్సిపల్ అధికారుల కనుసన్నల్లోనే జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారీగా వసూళ్ల పర్వం..

నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో గజం జాగా తక్కువలో తక్కువ లక్ష రూపాయలు పైనే పలుకుతున్నది. ఈ నేపథ్యంలో కొందరు తక్కువ స్థలంలోనే పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు బిల్డర్లు గ్రౌండ్ ప్లస్ 2, 3కి అనుమతులు తీసుకొని గ్రౌండ్ ప్లస్ 7, 8 ఫ్లోర్స్ నిర్మాణం చేపడుతున్నారు. దీనికితోడు అదనంగా అనుమతులు లేకుండానే సెల్లార్లు తీస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 20, 30 ఫీట్ల రోడ్డుకు 7, 8 అంతస్తుల మేర నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. అధికారులతో పాటు కొందరు నాయకులను కూడా నిర్మాణదారులు ‘మేనేజ్’ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఈ వ్యవహారం అంతా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

గతంలో ఇక్కడ పనిచేసిన టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఇతర అధికారులతో కలిసి అడ్డగోలుగా వసూళ్లపర్వానికి తెరలేపింది. చివరకు ఓ ప్లాట్ ఎల్ఆర్ ఎస్ క్లియరెన్స్ విషయంలో నాలుగున్నర లక్షల డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఆమె నార్సింగి మున్సిపాలిటీలో పనిచేసినన్ని రోజులు భారీగా అక్రమార్జననకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి సిబ్బందితో కలిసి టౌన్ ప్లానింగ్ అధికారి భారీగా వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో స్థాయిని బట్టి అధికారులకు కూడా భారీగా వాటాలు దక్కినట్లు విశ్వసనీయ సమాచారం. టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక హయాంలో అక్రమ నిర్మాణాలకు నార్సింగి మున్సిపాలిటీ అడ్డాగా మారింది. తీసుకున్న అనుమతులకు మించి అదనంగా వేసే ఒక్కో అంతస్తుకు లక్షల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన అధికారులు కోట్ల రూపాయల అవినీతి సొమ్ము జేబుల్లో నింపుకున్నట్లు తెలుస్తుంది. గతంలో పనిచేసిన టౌన్ ప్లానింగ్ అధికారి హయాంలో అక్రమ నిర్మాణాలు భారీగా వెలిశాయి.

బాధ్యతలు తీసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి..

నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిగా మౌనిక సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన మణిహారిక ఏసీబీ అధికారులకు పట్టుబడిన అనంతరం చాలాకాలం పాటు ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం తెల్లాపూర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో పని చేస్తున్న చంద్రకాంత్‌కు నార్సింగి ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. కొన్ని రోజులపాటు ఆయన పని చేశారు. తాజాగా సీడీఎంఏ అధికారులు మౌనికకు పూర్తిస్థాయి టౌన్ ప్లానింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. కనీసం ఇప్పుడైనా ఆమె పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story