వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

by Bhanu |

వర్షపు నీరు చేరి ముంపుకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు సూచించారు.

వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
X

దిశ, శేరిలింగంపల్లి : వర్షపు నీరు చేరి ముంపుకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు సూచించారు. భారీ వర్షంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో ముంపునకు గురైన ప్రాంతాలను బుధవారం జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో చెత్త, ఇతర వ్యర్థాలతో పూడుకుపోయిన కాలువలను తెరిపించడంతో పాటు బైపాస్ గా వరదకాలువ తవ్వకాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు.


వర్షాకాలం మళ్ళీ ఎక్కడా రోడ్డు మీద నీరు నిలబడకుండా.. వరద కాలువల ద్వారా వెళ్లేలా కాలువను విస్తరించాలని అన్నారు. రామచంద్రాపురంలో నీరు నిలబడడానికి కారణాలను జీహెచ్ఎంసీ, నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత చందానగర్.. లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య సురభి కాలనీ ప్రారంభంలో ఉన్న ఆర్ యూబీ వద్ద నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు గోపి చెరువు, చాకలి చెరువుల నుంచి వచ్చే వరదతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరదలతో ఇబ్బంది ఏర్పడుతోందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. బాక్స్ డ్రైన్

విస్తరించడంతో ఈ ఏడాది కొంత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డ్రైన్లలో చెత్త పేరుకుపోకుండా చూడాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ఈ పర్యటనలో జీహెచ్ఎంసీ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story