- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ మెట్రోలో మళ్లీ సాంకేతిక లోపం.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద నిలిచిన రైలు!
నగర వాసుల ప్రయాణానికి ఆయువుపట్టుగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నగర వాసుల ప్రయాణానికి ఆయువుపట్టుగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. తరచూ జరుగుతున్న ఈ తరహా ఘటనలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ వద్ద ఓ మెట్రో రైలు సాంకేతిక సమస్య కారణంగా మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం మెట్రో రైలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఆగిపోయింది. సుమారు 10 నిమిషాల పాటు రైలు అక్కడే నిలిచిపోవడంతో ఆ మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆకస్మాత్తుగా రైలు ఆగిపోవడంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారు సమయానికి వెళ్లలేక తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఈ లోపానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మెట్రో రైళ్లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితమే ఎర్రగడ్డ - భరత్ నగర్ మెట్రో స్టేషన్ల మధ్య కూడా ఓ మెట్రో రైలు సుమారు 8 నిమిషాల పాటు నిలిచిపోయింది. అప్పట్లోనూ సాంకేతిక సమస్యల వల్లే రైలు ఆగిపోయిందని, వెంటనే దాన్ని సరిచేశామని మెట్రో అధికారులు వివరణ ఇచ్చారు.






