నగరీకరణ సమస్యకాదు… అవకాశం: HMRL MD ఎన్వీఎస్ రెడ్డి

by Vemula.Srinu Prasad |

నగరీకరణ సమస్య కాదని అవకాశంగా చూడాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి అన్నారు. ..

నగరీకరణ సమస్యకాదు… అవకాశం: HMRL MD ఎన్వీఎస్ రెడ్డి
X

దిశ,సిటీ బ్యూరో: శరవేగంగా పెరుగుతున్న నగరీకరణ ప్రక్రియను ఒక సమస్యగా కాకుండా దానిని దేశ అభివృద్ధికి ఒక అవకాశంగా చూడాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి అన్నారు. అధిక జనాభా, పర్యావరణ సమస్యలు, కాలుష్య నియంత్రణ, వేగంగా పెరుగుతున్న నగరీకరణ వంటి సవాళ్లను ఎదుర్కోడానికి ఆర్కిటెక్ట్ లు తమ సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆలోచనలు చేయాలని తెలిపారు. వీటికి సామజిక, ఆర్థిక కోణంలో సాంకేతిక పరిష్కారాలను అన్వేషించాలని ఆయన సూచించారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత 'ఆర్కిటెక్చర్ రికనెక్ట్ సమ్మిట్' లో అయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

దేశంలో అత్యధిక జనాభా ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి ఉందని, దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే దేశ స్థూల సంపద (జీడీపీ) పెరగాలని చెప్పారు. చైనా వలే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చి, వ్యవసాయ రంగం నుండి వీలైనంత మందిని పారిశ్రామిక రంగానికి మళ్లిస్తే నగరీకరణ ప్రక్రియలో భాగంగా మన దేశాభివృద్ధి మరింత శీఘ్రతరం అవుతుందని మెట్రో ఎండీ తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైల్ గొప్ప ప్రజా రవాణా వ్యవస్థగా అత్యంత ఆదరణ పొందడానికి అనేక కొత్త ఆవిష్కరణలే కారణమని ఆయన అన్నారు. నగరాలలో ట్రాఫిక్ రద్దీ సమస్యకు మంచి ప్రజా రవాణా వ్యవస్థే సరైన పరిష్కారమని ఆయన చెప్పారు. ప్రస్తుతమున్న సాంకేతిక, డిజిటల్ వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకుంటూనే, సంప్రదాయంగా వస్తున్న సహజసిద్ధమైన భావనా నిర్మాణ సూత్రాలను జోడించి, ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడంలో ఆర్కిటెక్ట్ లు తగు మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. నగరాలలో ఎక్కువగా ఉన్న పేదరికం, సరైన గృహ సదుపాయాలు లేకపోవడం, ఆహ్లాదకరమైన బహిరంగ ప్రదేశాలు లేకపోవడం వల్ల నేరాల సంఖ్య పెరుగుతోందని ఆయన అన్నారు. అందువల్ల గృహ నిర్మాణ రంగం అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన పార్కులు, బహిరంగ ప్రదేశాలను అభివృద్ధి చేయాలని అన్నారు. ఇందుకు ఉదాహరణగా కొలంబియా లో ఉన్న బొగొటా నగరం గురించి ప్రస్తావిస్తూ, అద్భుతంగా సాధించిన ఆ నగరం అభివృద్ధి గాథను స్ఫూర్తివంతంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదనీటి ముంపు వంటి విపరీత పరిస్థితులను నగరాలు చవిచూస్తున్నాయని, వీటికి ఆర్కిటెక్ట్ లు తగు పరిష్కార మార్గాలు ఆన్వేషించాలని అయన తెలిపారు. వర్షపు నీటిని పొదుపు చేయడంలో సింగపూర్ చేపట్టిన చర్యలను ప్రస్తావిస్తూ, భూగర్భ నీటి స్థాయిని పెంచేలా తగు మార్గాలను అన్వేషించాలని, వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే నిర్మాణాలు తమ ప్రాజెక్టులలో అంతర్భాగం కావాలని ఆయన సూచించారు.

రవాణా ఆధారిత అభివృద్ధి పై ప్రత్యేక ఆలోచనలు చేయాలని, అందుకు అనుగుణంగా నగరాలలో మెట్రో మార్గాల వెంబడి బహుళ అంతస్తుల నివాస గృహాలను, కమర్షియల్ కాంప్లెక్సులను, విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలని మెట్రో ఎండీ సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రధానంగా కర్బన ఉద్గారాలను తగ్గించడం ముఖ్యమని, హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థలో అటువంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. తాము చేపట్టిన ఇంధన పొదుపు , పర్యావరణ హిత చర్యల వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను పొందడమే ఇందుకు తార్కాణమని చెప్పారు. నగరీకరణ గణనీయంగా పెరుగుతుంటే రవాణా పరమైన సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని, అందుకు దీటుగా నిర్మాణ రంగ నిపుణులు తగు పరిష్కార మార్గాలను శోధించాలని మెట్రో ఎండీ సూచించారు.

హైదరాబాద్ మెట్రో ఎంతో ఆదరణకు నోచుకోడానికి సుఖవంతమైన ప్రయాణం, ఇంధన పొదుపు, మహిళలకు తగు ప్రాధాన్యతను ఇవ్వడం ప్రధాన కారణమని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా వివిధ ఆర్కిటెక్ట్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్ళ ను ఎండీ ఎన్వీఎస్.రెడ్డి సందర్శించారు.

Next Story