HYD: మల్టీలెవల్ పార్కింగ్ పనులు షురూ..

by Ramesh Goud |

గ్రేటర్‌లో పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది.

HYD: మల్టీలెవల్ పార్కింగ్ పనులు షురూ..
X

దిశ, సిటీబ్యూరో : గ్రేటర్‌లో పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌తో పాటు పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. కేబీఆర్‌ పార్కు వద్ద మరీ ఎక్కువగా ఉంటుంది. పార్కింగ్ ఇబ్బందులను దృష్టిపెట్టుకుని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లే మార్గంలో కేబీఆర్ పార్కు వద్ద మల్టీలెవల్ పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆరులనెలల్లో పూర్తిచేసే విధంగా పనులు చేపడుతున్నట్టు బల్దియా అధికారులు చర్యలు ప్రారంభించారు.

రూ.6 కోట్లతో..

కేబీఆర్ పార్కు వద్ద చేపడుతున్న మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణానికి రూ.6 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. 15 మీటర్ల ఎత్తు, 405 చదరపు మీటర్ల వెడల్పుతో 4 అంతస్తుల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. 500 గజాల స్థలంలో కాఫీ షాప్‌తో పాటు మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కింగ్ ఏరియాలో ఒకేసారి 72 కార్లకు అవకాశముండే విధంగా డిజైన్ చేశారు. అయితే ఈ పార్కింగ్ రోటరీ సిస్టంతో పనిచేస్తోంది. కారు ఏ దిశలో ఉన్న పికప్ చేసుకుని పార్కింగ్ ఏరియాలోకి తీసుకెళ్లే విధంగా డిజైన్ చేశారు.

అంతా ఆన్‌లైనే..

మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ అంతా ఆన్‌లైన్‌లోనే పనిచేస్తోంది. ‘రియల్ టైం పార్కింగ్ సిస్టం’ ఆధారంగా పనిచేస్తోంది. దీన్ని గూగుల్ మ్యాప్‌తో అనుసంధానం చేయనున్నారు. అడ్వాన్స్డ్ స్లాట్ బుకింగ్ సిస్టంతో పాటు ఇక్కడ పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉందా? లేదా? (లైవ్ పార్కింగ్) తెలుసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. స్మార్డ్ కార్డులతో పాటు ఆన్‌లైన్ పేమెంట్స్ మాత్రమే చేయడానికి వీలుగా రూపొందించారు.

10 ఏండ్ల పాటు..

మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను పదేండ్లపాటు నిర్వహించడానికి నిర్మాణ సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం చేసుకుంది. పార్కింగ్ ద్వారా వచ్చే ఆదాయం నామమాత్రమే. కాఫీ షాప్ (స్నాక్స్ బార్)తో పాటు ఒక ఎల్ఈడీ ద్వారా అడ్వర్‌టైజ్‌మెంట్ కోసం జీహెచ్ఎంసీ అనుమతిచ్చింది. వీటి ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుని వాహనదారులకు మెరుగైన పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సదరు ఎజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

Next Story