పాఠశాలల్లో ముందస్తు ఫీజుల పట్ల హెచ్ఆర్సీ ఆగ్రహం

by Ratna Kumari |

పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూళ్ల పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

పాఠశాలల్లో ముందస్తు ఫీజుల పట్ల హెచ్ఆర్సీ ఆగ్రహం
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూళ్ల పట్ల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణ చర్యలు తీసుకోవాలని మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లా విద్యాశాఖాధికారికి ఆదేశాలు జారీ చేసింది. బోడుప్పల్ లోని పల్లవీ మోడల్ స్కూల్ యాజమాన్యం 2026-27 విద్యా సంవత్సరానికి 50 శాతం ఫీజు ముందుగానే వసూలు చేస్తోందని , పుస్తకాలు, యూనీఫాంల కోసం ముందస్తు చెల్లింపులు డిమాండ్ చేస్తోందని శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి హెచ్ఆర్సీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటువంటి చర్యలు అనుచితమైనవి, ఏకపక్షమైనవని, విద్యను వాణిజ్యపరంగా మలచరాదనే న్యాయ సూత్రాలకు విరుద్ధమని అన్నారు.


రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. విద్య అనేది ప్రాథమిక హక్కు అని, దానిని లాభాపేక్షతో నిర్వహించరాదన్నారు. ఇలాంటి చర్యలతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని, తక్షణ చర్యలు తీసుకుని, నిర్దిష్ట విక్రేతల వద్ద నుంచే పుస్తకాలు, యూనిఫాంల కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల పారదర్శకత లోపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను నివారించడంతో పాటు ప్రొటెక్షన్ ఆఫ్ హ్యుమెన్ రైట్స్ చట్టం 1993 ప్రకారం.. పాఠశాలపై చర్యలు తీసుకుని నెల రోజులలో నివేదిక అందజేయాలని డీఈఓకు హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నోటీసులు జారీ చేశారు.

Next Story