వామ్మో.. అద్దెలు..! హైదరాబాద్‌లో భగ్గుమంటున్న ఇంటి కిరాయిలు

by Javid Pasha |

హైదరాబాద్‌లోని ప్రైమ్ లొకేషన్‌లుగా పిలవబడే గచ్చి బౌలి, మాదాపూర్, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో అద్దె ఇంటి ధరలు భగ్గుమంటున్నాయి.

వామ్మో.. అద్దెలు..! హైదరాబాద్‌లో భగ్గుమంటున్న ఇంటి కిరాయిలు
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : దేశంలోని మెట్రో నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ మహా నగరంలో ఇంటి అద్దెలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు కిరాయిలు కట్టలేక, సొంతిళ్లు కొనుకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. నగరంలో ప్రాంతాలను బట్టి కూడా అద్దెలు ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మియాపూర్, యూసుఫ్ గూడ , ఎస్ ఆర్ నగర్, ఖైరతాబాద్, సోమాజీగూడ, కూకట్ పల్లి, సికింద్రాబాద్, విద్యానగర్, ఎల్బీనగర్ ఇలా ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా ఇంటి అద్దెలు ఉంటున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు అధికంగా శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. తాము పని చేసే ప్రాంతాలకు దూరమైనప్పటికీ అద్దెలు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని తమకు అనుకూలమైన ప్రాంతాలను వెతుక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో వారు సంపన్నులు నివాసముండే ఇతర ప్రాంతాలలో ఇండ్ల కిరాయిల గురించి ఆలోచించేందుకు కూడా జంకుతున్నారు.

బెంగుళూరుతో పోటీ..

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో హౌజ్ రెంట్ మార్కెట్ అంతకంతకు పెరుగుతోంది. కరోనా ముందు వరకు అందుబాటులో ఉన్న ఇంటి అద్దెలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం భాగ్యనగరంలోని హౌజ్ రెంట్స్ బెంగళూరు నగరంతో పోటీ పడే స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ మహా నగరంలో ప్రైమ్, ప్రీమియం లొకేషన్ లలో కనీసం ఇంటి అద్దె 40 వేల రూపాయలు కాగా ప్రాంతం, ఇంటిని బట్టి రూ 3 లక్షలకు పైగానే అద్దెలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అద్దె ఇంటి మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. అధిక వేతనం, అత్యధిక ఆదాయం ఉన్న వాళ్లు తప్ప సామాన్యులు, మధ్య తరగతి వాళ్లు హైదరాబాద్ లోని ఐటీ పరిసర ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండే అవకాశాలు తగ్గిపోతున్నాయి.

ఐటీ విస్తరించడంతో..

హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమ కారణంగా ఇంటి అద్దెలు అమాంతంగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రైమ్ లొకేషన్ లుగా పిలవబడే గచ్చి బౌలి, మాదాపూర్, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో అద్దె ఇంటి ధరలు భగ్గుమంటున్నాయి. అదే సమయంలో కూకట్ పల్లి, మియాపూర్, నిజాం పేట్, సనత్ నగర్, అమీర్ పేట్ వంటి ప్రాంతాల్లో ఇంటి అద్దె ధరలు రూ. 30 వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ మొత్తం 3 మార్గాల్లో వెళుతోంది. ఈ మార్గాల వెంబడి ఉన్న కాలనీల్లో కూడా అద్దె ఇంటి మార్కెట్ కు సైతం భారీగానే డిమాండ్ ఉండటంతో అద్దెలు భారీగానే ఉన్నాయి. అయితే మెట్రో రైల్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు, కాలనీల్లో ఇంటి అద్దెలు కాస్త అందుబాటులోనే ఉన్నాయని ఈ రంగంలోని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ప్రాంతాల్లో అందుబాటు ధరలు..

జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్, నాగోల్, బండ్లగూడ, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో అద్దె ఇళ్లు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ లభిస్తున్నాయి. సింగిల్ బెడ్రూం ఇళ్ల అద్దె ధరలు రూ.5 నుంచి 8 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. ఎల్బీనగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా అద్దె ఇంటి ధరలు ప్రజలకు కొంత అందుబాటులోనే ఉన్నాయి . సాగర్ రింగ్ రోడ్డు, మీర్ పేట్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, కుంట్లూరు వంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇంటి అద్దె రూ.15 వేల నుంచి రూ.18 వేల మధ్య ఉన్నాయి. ఎల్బీ నగర్ నుంచి కూడా మియాపూర్, రాయదుర్గంకు 30 నుంచి 40 నిమిషాల్లో మెట్రో రైల్ లో చేరుకోవచ్చు. కాబట్టి ఐటీ కారిడార్ లో పనిచేసే వారు ఇక్కడ సౌకర్యంగా అందుబాటు ధరల్లో లభించే అద్దె ఇళ్లను ఎంచుకుంటున్నారు. మొత్తం మీద ఐటీ హబ్ గా రూపాంతరం చెందుతున్న గ్రేటర్ హైదరాబాద్ లో ఇంటి కిరాయిలు రోజు రోజుకు పెరుగుతుండటం సామాన్యులను ఆందోళనలకు గురిచేస్తోంది.

Next Story