- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో దారుణం...కుళ్లిన మటన్, చికెన్!
జీహెచ్ఎంసీలో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసం, చికెన్ భారీ ఎత్తున పట్టుబడుతుండడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నది.

కుళ్లిన మటన్, చికెన్!
-అధికారుల దాడుల్లో బయటపడుతున్న మాంసం నిల్వలు
-పెరిగిన ధరలతో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులు
-లైసెన్స్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం
-స్ట్రీట్ ఫుడ్ కేంద్రాల్లో అపరిశుభ్రతపై అధికారుల ఆందోళన
ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియులు గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఉంటారు. శుభకార్యమేదైనా, సెలవు దినం వచ్చినా, దోస్తులు కలిసినా మటన్, చికెన్ లేకపోతే మజానే ఉండదు. ఇలా నాన్ వెజ్ టేరియన్ తినేవారు ఇకముందు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకు అనుకుంటున్నారా ? మీరు తినే మటన్, చికెన్ నాణ్యతగా ఉందో లేదో పరిశీలించాలి. ఆ తర్వాతే కొనాలి. ఈ పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఏర్పడ్డాయి.
దిశ, హైదరాబాద్ బ్యూరో: ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసం, చికెన్ భారీ ఎత్తున పట్టుబడుతుండడం ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. వ్యాపారులు నాణ్యత లేని, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల నగరంలో అధికారులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూడడం పరిస్థితికి అద్దం పడుతున్నది.
పెరిగిన ధరలు..
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సుమారు వారం రోజుల క్రితం వరకు కిలో చికెన్ రూ.300 నుంచి రూ.320 వరకు ఉండగా.. ప్రస్తుతం దీని ధర రూ.400లకు చేరింది. ఇదే సమయంలో మటన్ రేట్లు కూడా పెరిగిపోయాయి. కిలో మటన్ నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.940 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అది కూడా నాణ్యత లేకుండా ఎక్కడో
కోసిన మటన్‌ను తీసుకొచ్చి దుకాణాల్లో అమ్ముతున్నారు. ఈ మటన్‌ను పశు సంవర్ధకశాఖ అధికారులు పరీక్షించి దానిపై స్టాంప్ వేసి విక్రయాలకు అనుమతిస్తారు. చాలా దుకాణాల్లో ఇవేమీ పట్టించుకోకుండా ఎక్కడో కోసిన మటన్‌ను తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేస్తుండడం వీరికి కలిసి వస్తున్నది.
పట్టుబడుతున్న కుళ్లిన చికెన్ నిల్వలు..
గత వారంలో పార్శిగుట్టలో అధికారులు జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున కుళ్లిన మాంసం పట్టుబడింది. ఈ దాడుల్లో రూ.800 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే వ్యాపారం ఎలా సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ చికెన్‌ను వారాల తరబడి నిల్వ చేసి, బల్క్‌గా తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. చికెన్‌షాప్‌లో నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నది. ఎలుకలు, పిల్లులు తిరుగుతుండడంతో ఆ మాంసం పూర్తిగా కలుషితమైపోయింది. అయినా కూడా ఆ మాంసాన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ కూడా ఏడాది క్రితమే ముగిసినప్పటికీ నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగించడం గమనార్హం. ముషీరాబాద్‌లోని ఒక చికెన్ సెంటర్‌పై వారసిగూడ పోలీసులు దాడి చేసి 610 కిలోల అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఇలాంటి పాతబస్తీలో ఎక్కువగా నడుస్తోందని గుర్తించిన అధికారులు దాడులను ముమ్మరం చేశారు. ఈ నెల 11న మంగళహాట్ పరిధిలో దాడులు చేసి 300 కిలోల వరకు కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా వ్యాపారి మహ్మద్ అఫ్రోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిని నగరంలో చాలా మంది మటన్, చికెన్ వ్యాపారులు మాంసాన్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి, తక్కువ ధరకు వివాహ కార్యక్రమాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచ్చలవిడిగా స్ట్రీట్ ఫుడ్..
హైదరాబాద్ నగరంలో ఇటీవల స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చెప్పలేనంతగా పెరిగిపోయింది. తక్కువ ధరలకే తమ దగ్గర మటన్ భోజనం అంటూ భోజన ప్రియులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరు పెడుతున్న ఆహారం ఎంత వరకు నాణ్యమైందనేది చర్చనీయాంశంగా మారింది. లాభాపేక్షతో మటన్ వ్యాపారులు తక్కువ ధరలకు మేక, గొర్రెల మాంసం అంటూ విక్రయాలు చేపడుతున్నారు. వీరి వద్ద కొనుగోలు చేస్తున్న హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసాన్ని నిల్వ చేసి, వండి కస్టమర్లకు వడ్డిస్తున్న విషయం ఫుడ్ సేఫ్టీ, జీహెచ్‌ఎంసీ అధికారుల
దాడుల్లో బయటపడింది. అధికారుల దాడుల్లో కిచెన్ అపరిశుభ్రంగా, డ్రైనేజీ నీరు పొంగుతూ ఉండడం, చెడిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన వస్తువులను ఉపయోంచడం, సిబ్బంది హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ క్యాప్స్ ధరించకపోవడమే కాకుండా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ నాణ్యత లేని మటన్, చికెన్ విక్రయాలను నియంత్రించడానికి అధికారులు ప్రతినిత్యం దాడులు కొనసాగించి అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






