‘త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తాం’: ఆరోగ్యశాఖ మంత్రి

by Kodari Anjali |

రెండేళ్లలో 9572 ఉద్యోగాలు భర్తీ చేశాం..

‘త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తాం’: ఆరోగ్యశాఖ మంత్రి
X

దిశ , హైదరాబాద్ బ్యూరో: రెండేళ్లలో 9572 ఉద్యోగాలు భర్తీ చేశాం.. గతంలో ఎన్నడూ లేని విధ:గా ల్యాబ్ టెక్నీషియన్ల నియామక ప్రక్రియ వేగంగా పూర్తి చేశామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు . రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో మరో భారీ నియామక ప్రక్రియ ఒకేసారి 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు (గ్రేడ్-2) నియామక పత్రాలను అందజేసే కార్యక్రమం మంగళవారం కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌లతో కలిసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..

2025 నవంబర్ నాటికి నియామక ప్రక్రియను పూర్తి..

2024 సెప్టెంబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2025 నవంబర్ నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మొత్తం 23,323 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 1257 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. డీఎంఈ పరిధిలో 764, డీపీహెచ్‌లో 300, టీవీవీపీలో 180, ఎంఎన్‌జేలో 13 మందికి పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. ఒకప్పుడు రోగి లక్షణాలను బట్టి వైద్యం చేసేవారని కానీ నేడు రోగ నిర్ధారణ జరిగిన తర్వాతే చికిత్స ప్రారంభిస్తున్నారని చెప్పారు . ల్యాబ్ టెక్నీషియన్లు ఇచ్చే రిపోర్టులే డాక్టర్లకు ప్రామాణికమని , వైద్య వ్యవస్థకు మీరు కళ్లు, చెవుల్లాంటి వారని, మీ రిపోర్టుల్లో కచ్చితత్వం ఎంతో ముఖ్యమన్నారు . ఎన్ఏబీఎల్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ల్యాబ్స్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ల్యాబ్ టెక్నీషియన్లు తీసుకోవాలి అని మంత్రి పేర్కొన్నారు.

రెండేళ్లలో 9572 ఉద్యోగాల భర్తీ...

నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో 70 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి దామోదర గుర్తుచేశారు. ఒక్క ఆరోగ్య శాఖలోనే ఇప్పటివరకు 9,572 పోస్టులను భర్తీ చేశామని, మరో 7,267 పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న మరో 996 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదనంగా 2,344 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

ఉస్మానియా నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ప్రతి జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్, క్యాన్సర్ డే కేర్ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్, గాంధీ ఆసుపత్రిలో ఉచిత ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ హెల్త్ కేర్‌గా మారుస్తున్నామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే నూతన హెల్త్ పాలసీని రూపొందించి, అమలు చేయబోతున్నామని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఆరోగ్యశాఖను సీఎం రేవంత్ రెడ్డి తనకు ఇచ్చారని, ఈ శాఖకు మంత్రిగా ఉన్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు.

వైద్య రంగంలో ఆరోగ్య పరీక్షలు మరింత లోతుగా జరుగుతున్నాయి: మంత్రి పొన్నం

మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో ఆరోగ్య పరీక్షలు మరింత లోతుగా జరుగుతున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ఎంపికై నియామక పత్రాలు అందుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో నిత్యం డయాలసిస్ కేసులు ఎక్కువగా వస్తుండడంతో దానిని నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. హుస్నాబాద్‌ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్ది 280 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామని, 500 లకు పైగా హోటల్స్‌కు గ్లాస్ లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. దాని ద్వారా క్యాన్సర్ సంబంధిత వ్యాధులు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకున్నామని తెలిపారు .

Next Story