ఆనందం మీలోనే ఉంది.. అడ్రస్‌లో కాదు!

by Javid Pasha |

ఆనందం మీలోనే ఉంది.. అడ్రస్‌లో కాదు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : సొంతింటి కల నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దశాబ్దాలుగా కిరాయి ఇంట్లోనే ఉంటున్నామన్న అసంతృప్తి కూడా ఉంటుంది. తాము కూడా సంతోషంగా సొంతింట్లో ఉండాలని భావిస్తారు. అయితే ఇటువంటి ఆనందం కోసం సొంతింటిని వెతుక్కునే ముందు, చక్కటి ప్లానింగ్ కూడా ఉండాలి. లేదంటే ఆనందం కోసం మళ్లీ వెతుక్కోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఫ్లాట్లు కొనుగోలుపై విస్తృతంగా ప్రచారం చేస్తారు. సొంతింటికి వెళ్లగానే సంతోషంగా ఉండొచ్చుననుకుంటే పొరపాటే. అందుకే స్థిరాస్తి కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి. కలకాలం సంతోషంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అందుకే మీ ఆనందం మీలోనే ఉంది.. మీ చిరునామాలో కాదు.. మీ అంతస్తులో కాదు.. మీ ఫ్లాట్ సైజులో కాదంటూ రియల్ ఎస్టేట్ సోషల్ మీడియాలో ప్రచారం అందరినీ ఆకట్టుకుంటున్నది. అంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేస్తే సంతోషం రావాలి. కానీ అది కొనేందుకు చేసిన అప్పు తీర్చేందుకు ఇబ్బందులు పడేలా ఉండొద్దు. రియల్ ఎస్టేట్ జీవించడానికే తప్ప నిరూపించడానికి కాదు. అందుకే మీకు సౌకర్యవంతంగా, వీలైనంత ఈఎంఐ చెల్లించేలా అప్పు తీసుకోవాలి. అప్పుల ఊబిలో మిమ్మల్ని నెట్టనివ్వకండి. రూ. కోటి బ్యాంకు లోన్ తీసుకున్నారంటే ప్రతి నెలా రూ.75 వేలు కట్టాల్సిందే. అందుకనుగుణంగా మీ సంపాదన ఉండాలి. సంపాదన లేకుండా అప్పు చేస్తే ఈఎంఐ చెల్లించేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. పెద్ద ఇండ్లు అందరికీ కాదు. బాగా సంపాదన ఉన్నోళ్లకు లేదా పొదుపు చేసి లిక్విడ్ క్యాష్ ఉన్న వారికి మాత్రమేనని గుర్తించాలి. జీవనశైలిని మార్చుకోవాలి. కానీ అదే క్రమంలో డబ్బును వృథా చేయొద్దు. ఆనందాన్ని కాపాడుకోవాలి. అలాగే వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. దాంతోనే సంపద వస్తుంది. నిజాలను స్వీకరించడానికి ఎవరైనా సిద్ధం కావాలి. అంతే తప్ప స్థాయికి మించి అప్పులు చేసి ఇండ్లు కొనుగోలు చేయొద్దని రియల్ హైదరాబాద్ గ్రూపు స్పష్టం చేస్తున్నది.





Next Story