- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

దిశ, వనస్థలిపురం : తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. నాగోల్ డివిజన్ వసంత విహార్‌లో బాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యంలతో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సమాజంలోని ఇతర వర్గాల మాదిరిగానే బ్రాహ్మణుల్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయని, అలాంటి కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును మరింత బలోపేతం చేస్తూ సమాజ సేవకులను అందులో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు.
అర్చక వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆలయాల అభివృద్ధికి రూ.300 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. బ్రాహ్మణ సంఘాలు, ఉపవర్గాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి పరిషత్తుకు సహకరించాలని సూచించారు. చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖలకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక, విద్యా, వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నివాస సౌకర్యం లేని నిరుపేదలకు తక్కువ ఖర్చుతో గృహ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంస్థల అధ్యక్షులు మల్రెడ్డి రాంరెడ్డి, చల్ల నరసింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, అధికార ప్రతినిధి శ్రీ సత్యం శ్రీరంగం, ప్రోగ్రాం కన్వీనర్ నందిరాజు లక్ష్మీనారాయణ, బాస్ ప్రతినిధులు వక్కలంక శ్రీనివాస్, ఎం.వి.శాస్త్రి, ఆర్సీ మూర్తి, కైలాష్ తదితరులు పాల్గొన్నారు.






