ఫ్యూచర్ సిటీలో షూటింగ్స్.. ఫిల్మ్‌ సిటీల నిర్మాణం కూడా!

by Javid Pasha |

భారత్ ఫ్యూచర్ సిటీలో వరల్డ్-క్లాస్ ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ సిటీ అభివృద్ధికి బాలీవుడ్ నటులు ముందుకు వస్తున్నారు. పలువురు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నారు.

ఫ్యూచర్ సిటీలో షూటింగ్స్.. ఫిల్మ్‌ సిటీల నిర్మాణం కూడా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మార్మోగుతున్నది. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. అయితే ఫిల్మ్ సిటీలు నిర్మించేందుకు కూడా బాలీవుడ్ స్టార్లు సానుకూలంగా ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్యూడియోలే కాదు.. మరి కొన్ని ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోనే నిర్మించేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇటీవల ఫిల్మ్ సిటీలకు సంబంధించి “ఫిల్మ్ ఇన్ తెలంగాణ” సెషన్ జరిగింది. తెలంగాణను క్రియేటివ్ ఎకానమిలో ముందుంచేందుకు చర్చలు జరిగాయి. ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ స్టూడియోలు, ఫిల్మ్ సిటీల అభివృద్ధికి ఒప్పందాలు జరిగాయి.

ఫిల్మ్ సిటీల డెవలప్‌మెంట్

ప్రధానంగా ఫిల్మ్ సిటీల డెవలప్‌మెంట్ కోసం జరిగిన అగ్రిమెంట్స్ బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవ్‌గణ్, సల్మాన్ ఖాన్‌లకు సంబధించినవి. ఇవి హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా మార్చడానికి సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఇక్కడ స్టూడియో నిర్మాణానికి అజయ్ దేవగణ్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో వరల్డ్-క్లాస్ ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్ సిటీ అభివృద్ధి. వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియో సౌకర్యాలు, కట్టింగ్-ఎడ్జ్ ప్రొడక్షన్ కెపాబిలిటీలు ఉంటాయి. అజయ్ దేవ్‌గణ్ రైజింగ్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేయనున్నారు. అలాగే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ రూ.10 వేల కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్‌షిప్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనున్నది. ఈ స్యూడియోలు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నట్లు సినీ రంగంలో చర్చ జరుగుతుంది.

పాత స్యూడియోలు కూడా..

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని హీరో నాగార్జున ప్రకటించారు. ఈ స్యూడియోను తరలిస్తారా? లేక అక్కడ కూడా కొత్తది నిర్మిస్తారా? అన్నది తెలియలేదు. అయితే సువిశాలమైన స్టూడియోను నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నారని మాత్రం టాక్. కేవలం స్టూడియో మాత్రమే కాకుండా మారుతున్న నిర్మాణ అవసరాలకు తగ్గట్టుగా అత్యాధునిక సౌకర్యాలతో ఫిల్మ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇవి నిర్మాణమైతే సినీ రంగంలోనూ హైదరాబాద్ కింగ్‌ మేకర్ అవుతుంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ పర్యాటకులను, సినిమా ఇండస్ట్రీని ఆకట్టుకుంటున్నది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్ సిటీ పేరు సంపాదించుకున్నది. అక్కడ ప్రతి రోజూ కనీసం నాలుగైదు సినిమాలు, వెబ్ సిరీస్, సిరియల్ షూటింగ్స్ జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాల ప్రకారం బాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ హీరోలు నిర్మాణాలు పూర్తి చేస్తే హైదరాబాద్ కంటెంట్ కింగ్‌గా మారుతుంది.

Next Story