మూసీపై స్పెషల్ ఫోకస్.. అభివృద్ధే లక్ష్యం

by Javid Pasha |

మూసీ పునరుజ్జీవనంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుబాటులో ఉన్న భూమిని వివిధ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నది.

మూసీపై స్పెషల్ ఫోకస్.. అభివృద్ధే లక్ష్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక మూసీ పునరుజ్జీనవంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. అందుకు సంబంధించిన డీపీఆర్ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే మూసీ ప్రాజెక్టులో భూమి వినియోగ ప్లాన్, ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ వంటివి కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా భూ వినియోగ మాస్టర్ ప్లాన్‌పై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాల్లోని మూసీని ఆనుకొని ఉన్న 734 ఎకరాలను కేటాయించింది. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మూసీ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నది. ఒక పక్క ఫ్యూచర్ సిటీ.. మరో పక్క మూసీ కారిడార్లలో కార్యక్రమాలను ప్రారంభించేవిధంగా చర్యలు తీసుకుంటున్నది

55 కిలోమీటర్లు మేర కారిడార్

మూసీ నది హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీని పొడుగుతా గతంలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా నిధుల్లేక, ప్రభుత్వం పట్టించుకోక ప్రాజెక్టు మరుగునపడింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూసీ పునరుజ్జీవనంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివిధ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. అందుబాటులో ఉన్న భూమిని వివిధ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. కాగా జోనింగ్ విధానంపై ఉత్తర కొరియాలోని సియోల్, గుజరాత్‌లోని సబర్మతి నది ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించిన విషయం తెలిసిందే. అంగుళం భూమి కూడా వృథా పోకుండా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు

మూసీ ప్రాజెక్టులో మార్కీ(ల్యాండ్ మార్క్) ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. సమీప ప్రాంతాల్లో టూరిజాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అవసరమైన ప్రాజెక్టులను రూపొందించాలని, అందుకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే లంగర్ హౌస్‌లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నది. దీనికోసం 200 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. కాగా రక్షణ శాఖ మాత్రం 45 ఎకరాలు ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిసింది. సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం తరహాలో గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి, నాగోల్‌లో శిల్పారామం, జాతీయ జెండా ఏర్పాటు చేసిన ప్రాంతాలను మార్కీ ప్రాజెక్టులుగా తీర్చిదిద్దడం వంటివి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్

రోడ్లు, నీరు, విద్యుత్, నాలాలు, ఇతర ప్రధాన సేవల అభివృద్ధి గురించిన ప్లాన్ కూడా ప్రభుత్వ పరంగా తయారు చేయనున్నారు. కాగా ఇది అవసరమైన భౌతిక వసతులను పెంచి, సుస్థిర అభివృద్ధిని, సంబంధిత ప్రాంతంలో సమగ్ర కనెక్టివిటీని నిర్ధారించేవిధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా ఇందులో ఈస్ట్-వెస్ట్ కారిడార్ కోసం డీపీఆర్ రూపొందించాలని నిర్ణయించారు. మూసీకి ఇరువైపులా ఈ కారిడార్ అభివృద్ధికి తగిన ప్రణాళిక, అమలు గురించి సమగ్ర సాంకేతిక నివేదిక తయారు చేయనున్నారు.

పెట్టుబడులను ఆకర్షించేలా వసతులు

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ.4100 కోట్ల రుణం ఇవ్వడానికి ఏడీబీ సూత్ర ప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఓవైపు మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపడుతూనే.. మరో వైపు దానికి ఆనుకుని ఉన్న 734 ఎకరాలల్లో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చేలా మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ నదికి సమీపంలోని గండిపేట మండలంలోగల హిమాయత్‌ సాగర్‌, కిస్మత్‌పూర్‌, రాజేంద్రనగర్‌ మండలానికి చెందిన ప్రేమావతిపేట్‌, బుద్వేల్‌ ప్రాంతాల్లోని టీఈఈఆర్‌ఎల్‌, ఐఐపీహెచ్‌, ఇతర సంస్థలకు కేటాయించిన భూములతోపాటు శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ పరిధిలో హెచ్‌ఎండీఏ లే అవుట్‌ కోసం కేటాయించిన భూమిని మూసీకి బదలాయించారు.

గ్లోబల్ కేపాబులిటీ సెంటర్ ఏర్పాటు

ప్రాజెక్ట్ సమీప ఈ భూముల్లో గ్లోబల్ కేపాబులిటీ సెంటర్(జీసీసీ)లను ఏర్పాటు చేయడానికి ఆయా కంపెనీలు ముందుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలోగా 120 జీసీసీలను రప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతోపాటు ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, వివిధ సర్వీస్ కంపెనీలకు చెందిన కార్పొరేట్ ఆఫీసుల నిలయంగా తీర్చిదిద్ధాలని ప్రభుత్వం భావిస్తున్నది. అట్లనే లంగర్ హౌస్ బాపూ ఘాట్ వద్ద 100 ఎకరాల్లో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును, దాంతోపాటు ఒక ఐకానిక్ టవర్‌ను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భూమి సేకరణలో భాగంగా రక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. అయితే 44 ఎకరాలు ఇవ్వడానికి మిలటరీ అధికారులు అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా టూరిస్ట్ ప్రాంతంగా మార్చాలని సర్కార్ యోచిస్తోంది.

Next Story