దోమల కట్టడిపై జీహెచ్ఎంసీ ఫోకస్

by Yella Dhawani Reddy |

బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు నగర ప్రజలను దోమల బాధ నుండి రక్షించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ముమ్మరంగా యాంటీ లార్వా ఆపరేషన్లపై ఫోకస్ పెట్టింది

దోమల కట్టడిపై జీహెచ్ఎంసీ ఫోకస్
X

దిశ, సిటీ బ్యూరో : బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు నగర ప్రజలను దోమల బాధ నుండి రక్షించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ముమ్మరంగా యాంటీ లార్వా ఆపరేషన్లపై ఫోకస్ పెట్టింది. ఒక్క జులై నెలలో 15,500కు పైగా కాలనీలల్లో దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్‌లు చేపట్టింది. అలాగే దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సంబంధిత కరపత్రాలను ఇంటింటికి వెళ్లి జీహెచ్ఎంసీ పంపిణీ చేస్తోంది.

34.45 లక్షల ఇండ్లలో..

యాంటీ లార్వా ఆపరేషన్‌లలో భాగంగా ఇప్పటివరకు 34.45 లక్షల ఇండ్లను రెండు, మూడు సార్లు రిపీట్‌గా తనిఖీ చేయగా లార్వా‌తో ప్రభావమైన ఇండ్లు 1.5 శాతం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. 1.10కోట్ల కంటైనర్లను తనిఖీ చేయగా 0.5 శాతం కంటైనర్లు ప్రభావితమైనట్లు నిర్దారణ అయ్యింది. జులైలో 1,700 కు పైగా స్కూల్‌లలో, 320‌కు పైగా కళాశాలలో ఐఆర్ఎస్ స్ప్రే గురించి పిల్లలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు చేపట్టారు.

నిరంతరం పర్యవేక్షణ..

పకడ్బందీ ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న కార్యక్రమాలను కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నారు. లోటుపాట్లను సమీక్షిస్తూ యాంటీ లార్వా ఆపరేషన్లు ప్రభావంతంగా చేపట్టేందుకు అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. బల్దియా క్రమం తప్పకుండా చేపడుతున్న చర్యలు క్షేత్ర స్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. గతం కంటే కీటక జనిత వ్యాధులు తక్కువగానే నమోదు అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

Next Story