- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తిపన్ను ఆదాయంపై బల్దియా ఫోకస్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేయడానికి మరోసారి వన్ టైం సెటిల్‌మెంట్ స్కీమ్(ఓటీఎస్) తీసుకురావాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేయడానికి మరోసారి వన్ టైం సెటిల్‌మెంట్ స్కీమ్(ఓటీఎస్) తీసుకురావాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అనుమతి కోసం దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడానికి స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించనుంది. అభివృద్ధి, మౌలిక వసతులతో పాటు అత్యవసర సేవలందించే, జీహెచ్ఎంసీ తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ సమావేశం జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తర్వాత నేడు(గురువారం) మరోసారి సమావేశం కానుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు అధికారులు పలు కీలక ప్రతిపాదనలను సిద్ధం చేశారు. మొత్తం 21 అంశాలతో కూడిన అజెండాలోని ప్రతి అంశాన్ని పరిశీలించడంతోపాటు చర్చించనున్నారు. వీటిలో జీహెచ్ఎంసీ ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను మొండి బకాయిలు సుమారు రూ.10వేల కోట్లకు పైగా ఉంటాయని అధికారులు అంచనా వేశారు. వీటిలో ఈ ఏడాదిలో కనీసం రూ.1000 కోట్ల వరకు వసూలు చేసేందుకు వీలుగా వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీం(ఓటీఎస్)ను అమల్లోకి తీసుకురావడానికి ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీలో చర్చించనున్నారు.
ఈ సారి నెల ముందే అమల్లోకి
ఈ వన్ టైమ్ సెటిల్‌మెంట్(ఓటీఎస్)ను ఈ సారి నెల ముందే అమల్లోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. ఓటీఎస్‌లో వడ్డీలో 90 శాతం రాయితీ కల్పించే అవకాశముంది. ఈ స్కీమ్ ద్వారా రూ.1000 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంటే కనీసం రూ.300 కోట్లు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు వర్షాకాలంలో హైడ్రా వద్ద పని చేసిన 5 కేటగిరీలకు సంబంధించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నెలల జీతాలు నెలకి రూ.35.11లక్షల చొప్పున మొత్తం రూ.1,05,35,850 విడుదల చేయాలన్న ప్రతిపాదననూ కమిటీలో చర్చించనున్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, యంత్రాల కొనుగోలు కోసం హైడ్రాకు రూ.20 కోట్లను వెంటనే విడుదల చేసే ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనున్నందున పలు కీలకమైన ప్రతిపాదనలు కమిటీ ముందు పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
కమిటీ ముందుకు రానున్న ప్రధానాంశాలు..
- హెచ్ సిటీ కింద ప్రతిపాదిత 4 లేన్‌ల రసూల్‌పురా జంక్షన్ నిర్మాణం కోసం సవరించిన రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ ఆమోదం, దీని వెడల్పు 30 మీటర్లు, 15 మీటర్ల నుంచి 20.5 మీటర్లు వైడెనింగ్ కోసం ప్రతిపాదించిన విధంగా 26 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి ఆమోదం కోసం ప్రతిపాదన కమిటీ ముందుకు రానున్నట్లు తెలిసింది.
- హెచ్ సిటీలో భాగంగా ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రతిపాదిత ఫ్లైఓవర్, ఆర్‌ఓబీ, ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం కోసం 2 సెట్ల ఆర్డీపీల ఆమోదం కోసం, ఆర్కే పురం జంక్షన్ మినహా కంటోన్మెంట్ ప్రాంతంలో కవర్ చేసిన వెడల్పులు 16.61 మీటర్లు, 30.50 మీటర్లు, 33.00 మీటర్లు, 19.30 మీటర్ల నుంచి 45 మీటర్ల వరకు విస్తరించేందుకు 10 ఆస్తుల నుంచి స్థల సేకరణకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి ఆమోదం కోసం ప్రతిపాదన కమిటీ ముందుకు రానుంది.
- మూసాపేట సర్కిల్ కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో కొంత భాగంలో ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీ ఏర్పాటు చేసేందుకు అనుమతితో పాటు రూ.5 కోట్లు మంజూరు కోసం స్టాండింగ్ కమిటీ ముందుకు రానుంది.
- చౌమహల్లా ప్యాలెస్ సమీపంలోని ఖిల్వత్‌లో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్ కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్‌పీ) పిలవడానికి ఆమోదం కోసం, అలాగే డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్(డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో 15 ఏళ్ల పాటు నిర్మాణం కోసం అధికారులు రూపకల్పన చేసిన ప్రతిపాదన కూడా ఆమోదం కోసం కమిటీ ముందుకు రానుంది.
- హెచ్ సిటీ కింద రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్, గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి సంబంధించి పలు మార్పులను మాస్టర్ ప్లాన్‌లో చేర్చడానికి ప్రభుత్వానికి తెలియడజేయడంతో పాటు 106 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించాలన్న ప్రతిపాదన స్టాండింగ్ కమిటీ ముందుకు ఆమోదం కోసం రానున్నట్లు తెలిసింది.
- మాసబ్ ట్యాంక్‌లోని నెహ్రూ పార్క్ స్పోర్ట్స్ ప్లేగ్రౌండ్‌ను స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ సాయి బాబా 33 ఏళ్లుగా అక్రమంగా ఆక్రమించడంతో పాటు లీజు ఫీజు చెల్లించడంలేదని, దీనిపై స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలన్న కీలక ప్రతిపాదన కమిటీ ముందుకు రానున్నట్లు తెలిసింది.
- ఫతేనగర్ నుంచి బల్కంపేట్ వెళ్లే ఫ్లైఓవర్, ఫతేనగర్ నుంచి సనత్ నగర్ వెళ్లే ఫ్లైఓవర్ల పునరుద్ధరణ పనుల కోసం రూ.12కోట్ల మంజూరు కోరుతూ కమిటీ ముందుకు ప్రతిపాదన రానున్నట్లు సమాచారం.






