సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో గంజాయి స్మ‌గ్లింగ్ రాకెట్ భ‌గ్నం

by Ratna Kumari |

అంత‌ర్రాష్ట్ర గంజాయి స్మ‌గ్లింగ్ రాకెట్ ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ సంయుక్తంగా భ‌గ్నం చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో గంజాయి స్మ‌గ్లింగ్ రాకెట్ భ‌గ్నం
X

దిశ, సికింద్రాబాద్ : అంత‌ర్రాష్ట్ర గంజాయి స్మ‌గ్లింగ్ రాకెట్ ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ సంయుక్తంగా భ‌గ్నం చేశారు. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన ఓ గంజాయి రవాణా దారుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 14.322 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.7,16,100గా అధికారులు అంచనా వేశారు. ఈ కేసు క్రైమ్ నెం. 375321`జ‌48/2026గా నమోదు చేసి, NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాలోని బలుగావ్ నుంచి పుణేకు గంజాయి తరలించే యత్నం జరుగుతుండగా ఈ రాకెట్ బయటపడింది.


బిహార్ రాష్ట్రానికి చెందిన జవహర్ కుమార్ (32) అనే వ్యక్తి సెంట్రింగ్ పనులు చేస్తూ ఉండగా.. అఖిలేష్ కుమార్ అనే వ్యక్తి అతనికి పరిచయమై గంజాయి రవాణా చేయమని ప్రలోభపెట్టాడు. ప్రతి ట్రిప్‌కు రూ.7,000 ఇస్తానని చెప్పడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా జవహర్ కుమార్ అంగీకరించాడు. ఈ క్రమంలో మే 3న అఖిలేష్ కుమార్ ట్రాలీ సూట్‌కేస్‌లో గంజాయి ప్యాకెట్లను పెట్టి జవహర్‌కు అప్పగించాడు. విశాఖ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో ప్రయాణించిన అతడు మే 4 ఉదయం సికింద్రాబాద్‌కు చేరుకున్నాడు. అనంతరం మరిన్ని సూచనలు కోసం వేచి ఉండగా.. ఉదయం 11:45 గంటల సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను రైల్వే పోలీసు అధికారులు, ఆర్.పీ.ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు. కేసులో ప్రధాన నిందితుడు అఖిలేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story