వాకథాన్‌ను ప్రారంభించిన సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

by Kodari Anjali |

మ‌ధుమేహం అనేది చాలా సాధారణమంగా మొదలయ్యే సమస్య అని, చాలా మందికి తమకు ఉందన్న విషయమే తెలియదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

వాకథాన్‌ను ప్రారంభించిన సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: మ‌ధుమేహం అనేది చాలా సాధారణమంగా మొదలయ్యే సమస్య అని, చాలా మందికి తమకు ఉందన్న విషయమే తెలియదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ మేరకు ఆదివారం నిర్వ‌హించిన వాక‌థాన్‌ను ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ ఛైర్మ‌న్ ర‌మేష్ గోరంట్ల‌, టాలీవుడ్ న‌టుడు సుశాంత్‌, కిమ్స్ ఆస్ప‌త్రుల ఛైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌రరావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మధుమేహం వ్యాధి ఉన్న‌వాళ్లు త‌మ క‌ళ్లు, కాళ్లతో పాటు ఇత‌ర అవ‌య‌వాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలన్నారు.

కంటిచూపు త‌గ్గుతున్నా, కాళ్ల మీద పుళ్లు క‌నిపించినా, ఏమైనా దెబ్బ‌లు తగిలినా వెంట‌నే త‌గిన చికిత్స‌లు తీసుకోవాలని సూచించారు. వాటిలో నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల చాలామందికి కాళ్లు తొల‌గించాల్సిన ప‌రిస్థితి ఏర్పడుతోందని, ప్ర‌తిరోజూ త‌గినంత న‌డ‌క‌, యోగా, లేదా మ‌రేదైనా భౌతిక కార్య‌క‌లాపాల‌తో చురుకైన జీవ‌న‌శైలి గ‌డ‌పాలని, స్మార్ట్ ఫోన్లు, ఇత‌ర గాడ్జెట్ల మీద ఎక్కువ‌గా ఆధార‌ప‌డితే శారీర‌క కార్య‌క‌లాపాలు త‌గ్గిపోయి ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నీ వ‌స్తాయని అన్నారు. ఈ సంద‌ర్భంగా కిమ్స్ ఆస్ప‌త్రుల సీఎండీ, ప్ర‌ముఖ కార్డియోథొరాసిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు మాట్లాడుతూ.. మ‌ధుమేహుల్లో 15 నుండి 25 శాతం మందికి త‌మ జీవిత‌కాలంలో ఎప్పుడో ఒక‌ప్పుడు కాళ్ల మీద పుళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుందన్నారు.

అయితే వీరికి న‌రాలు పాడ‌వ్వ‌డం వ‌ల్ల ఇలాంటి సాధార‌ణ పుండ్ల వ‌ల్ల వాళ్ల‌కు నొప్పి అంత‌గా తెలియ‌దని, ఫలితంగా అవయవాలు తొలగించాల్సిన ప్రమాదం ఏర్పడుతోందన్నారు. అందువ‌ల్ల మ‌ధుమేహం ఉన్న‌వారంతా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ కాళ్ల విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ద ఫుట్ డాక్ట‌ర్ ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్, సీఈఓ, క‌న్స‌ల్టెంట్ వాస్క్యుల‌ర్, ఎండోవాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్, పోడియాట్రీ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ న‌రేంద్ర‌నాథ్ మేడా తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్ వూండ్ అనే యాప్‌ను ఆవిష్క‌రించారు.

Next Story