ఏఐతో ‘ఎఫ్ఐఆర్’.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కొత్త ప్రయోగం

by I. Sairam |

సైబర్ బాధితుల ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయడానికి హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సీ-మిత్ర పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఏఐతో ‘ఎఫ్ఐఆర్’.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కొత్త ప్రయోగం
X

దిశ, సిటీక్రైం: సైబర్ బాధితుల ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయడానికి హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సీ-మిత్ర పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏఐ (అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయడానికి సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. సైబర్ బాధితులు 1930 లేదా సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదులను సీ-మిత్ర (సైబర్ మిత్ర) వర్చ్యూవల్ పోలీసు ఆఫీసర్స్ పరిశీలిస్తారు. సీ- మిత్ర టీం అధికారులు బాధితులకు 040-4189-3111 లేదా 87126 సీరిస్ నుంచి ఫోన్ చేసి ఏఐ ద్వారా రూపొందించిన ఫిర్యాదు కాపీని వాట్సాప్‌లో పంపిస్తారు. ఆ ఫిర్యాదును పూర్తిగా పరిశీలించి బాధితులు సంతకం చేసి వాటిని తిరిగి కొరియర్ లేదా సీ-మిత్ర హెల్ప్ డెస్క్ లేదా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లోని డ్రాప్ బాక్స్‌లో ఇవ్వాలి. దాని ఆధారంగా ముందుగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత పోలీసు స్టేషన్‌కు ఎఫ్ఐఆర్‌ను పంపిస్తారు. సైబర్ క్రైం విభాగం పోలీసు అధికారి బాధితులకు ఫోన్ చేసి దర్యాప్తును వేగవంతంగా చేస్తారు.

18 శాతం మాత్రమే ఫిర్యాదులు..

సైబర్ మోసాల్లో బాధితులు 1930కు ఫోన్ చేసిన తర్వాత స్థానికంగా ఫిర్యాదులు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, ఫిర్యాదు ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలియకపోవడంతో కంప్లెయింట్‌లను చేయడంలేదు. కేవలం 18 శాతం ఫిర్యాదులు మాత్రమే నమోదవుతున్నాయి. ప్రతి సైబర్ చీటింగ్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడం కోసమే సీ-మిత్రను అందుబాటులోకి తీసుకొచ్చామని సీపీ సజ్జనార్ తెలిపారు. ట్రయల్ రన్‌లో సీ-మిత్ర ఇప్పటి వరకు 86 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసి బాధితులకు భరోసాను కల్పించిందన్నారు. సైబర్ మిత్ర టీం, వర్చ్యూవల్ పోలీసు ఆఫీసర్స్ ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తారని వివరించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ఈ సీ-మిత్ర వ్యవస్థను ఉపయోగించుకోవాలని సీపీ కోరారు.

Next Story