- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా ఎఫెక్ట్..! బఫర్‌జోన్లపై క్లారిటీతో పుంజుకుంటున్న స్థిరాస్థి వ్యాపారం
గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏడాదికాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని, హైడ్రానే కారణమని కొందరు విమర్శలు చేశారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏడాదికాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని, అందుకు హైడ్రానే కారణమని ప్రతిపక్షపార్టీలు, పలువురు రియల్ వ్యాపారులు, కబ్జాదారులు విమర్శలు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా మారిందని చెప్పొచ్చు. అందుకు హౌసింగ్ బోర్డు, టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేయడమే నిదర్శనం. రాయదుర్గంలో ఎకరాకు రూ.177 కోట్లు, కుత్బుల్లాపూర్‌లో గజానికి రూ.1.14 లక్షలు పలకడం రియల్ భూమ్ తగ్గలేదనడానికి నిదర్శనం. భూముల ధరలు పెరగడానికి.. హైడ్రాకు ఏం సంబంధమని అనుకుంటున్నారా ? ఇక్కడే తిరకాసు. గతంలో పేద, మధ్యతరగతి ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుతో సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నారు. ఆ బిల్డింగ్‌ను చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించారా ? బఫర్ జోన్ లో నిర్మించారా ? అనేది తెలియక మోసం పోయినా సంఘటనలు అనేకం ఉన్నాయి. అలా బిల్డర్లు నిర్మించేవారు..బ్యాంకర్లు లోన్లు ఇచ్చేవారు.. జనం కొనేవారు. కానీ హైడ్రా వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది.
నీటి వనరుల పరిరక్షణలో..
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆస్తులను పరిరక్షించడానికి 2024 జులై19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. నామరూపాల్లేకుండా పోయినా బతుకమ్మకుంటను పునరుద్ధరించింది. రూ.50 వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడారు. ప్రభుత్వ భూములు 424 ఎకరాలు, రోడ్ల ఆక్రమణలు 218 ఎకరాలు, చెరువుల కబ్జాలు 233 ఎకరాలు, పార్కుల ఆక్రమణలు 25 ఎకరాలు, అక్రమ నిర్మాణాలు 7 ఎకరాలు ఇలా మొత్తం 923.14 ఎకరాల భూములను హైడ్రా పరిరక్షించింది. దీంతోపాటు చెరువుల పునరుద్ధరణపై హైడ్రా దృష్టి సారించింది. బతుకమ్మకుంట తరహాలోనే సున్నం చెరువు, తమ్మిడికుంట, ఉప్పల్ నల్లచెరువు, భమృక్ ధౌలా, కూకట్ పల్లిలోని నల్లచెరువులను రూ.58.40కోట్లతో పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీంతో 105 ఎకరాలున్న చెరువులను 180ఎకరాలకు పెంచింది. అప్పటి నుంచి సుమారు రూ.50 వేల కోట్ల విలువైన ఆస్తులను పరిరక్షించింది. దీంతోపాటు చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడింది.
బిల్డర్లు, బ్యాంకర్లు..
హెచ్ఎండీఏ పరిధిలో చాలా చెరువులను ఆక్రమించి పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు బహుళ అంతస్థుల భవనాలు నిర్మించిన విషయం తెలిసిందే. అంతేకాదు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ (సీఎస్ఆర్) పేరుతో చెరువులను అభివృద్ధి చేస్తామని చెరబట్టిన సంస్థలు లేక్ వ్యూ పేరుతో వ్యాపారాలు కూడా చేస్తున్నాయి. అందుకు అన్ని ప్రభుత్వ సంస్థల సహకరమూ లేకపోలేదు. దీంతో ప్రజలు ఇండ్లను కొనుగోలు చేయడం, మోసం పోవడం పరిపాటిగా మారింది. కానీ హైడ్రా వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. చెరువులను సర్వే చేసి ఆక్రమణలను గుర్తించడంతోపాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల హద్దులు నిర్వహించడంతో బడా నిర్మాణ కంపెనీల మోసాలు బహిర్గతమయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు, హైడ్రా హెచ్చరికల నేపథ్యంలో చెరువులను ఆక్రమించొద్దని, నీటి వనరుల్లో నిర్మాణాలు చేపట్టొద్దనే అభిప్రాయానికి బిల్డర్లు, డెవలపర్లు రావడం స్థిరాస్థి వ్యాపారంలో పెనుమార్పుగా అభివర్ణిస్తున్నారు. దీంతోపాటు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో సేల్ డీడ్ ఉంటే చాలు.. అది ఎక్కడున్న ఫర్వాలేదని..ఆఫీసుల్లో కూర్చొనే లోన్లు ఇచ్చేవారు. హైడ్రా హెచ్చరికల నేపథ్యంలో అన్ని ప్రతాలు సరిగ్గా ఉన్నా… ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయా ? లేదా ? అనే విషయాలను ఫీల్డ్ లోకెళ్లి విధిగా పరిశీలించిన తర్వాత లోన్ ప్రాసెస్ చేస్తున్నట్టు పలు సంస్థలు చెబుతున్నాయి. హైడ్రా కారణంగా అక్రమ వ్యాపారాన్ని బంద్ చేసి సక్రమంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని బిల్డర్లు, బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజల్లో అవగాహన..
రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందనడానికి.. పుంజుకున్నదనడానికి సేల్స్ ఒక్కటే గీటురాయికాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొన్నా..లేఅవుట్ లో ప్లాట్ కొన్నావాళ్లకు ఎలాంటి ఇబ్బంది గానీ, వివాదాలేనప్పుడే సేల్స్ పెరిగే అవకాశముంటుంది. ప్రజలు కూడా ముందుకొస్తారు. హైడ్రా కారణంగా ఇల్లు కొనాలన్నా.. స్థలం కొనాలన్నా..అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే ముందుకుపోతున్నారు. పదిసార్లు.. పలురకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. మేం కొనే ఇల్లు, స్థలం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నాయా ? అని చెక్ చేసుకుంటున్నారు. ఫామ్ ల్యాండ్ పేరుతో జరిగే మోసాలు సైతం తగ్గుముఖం పట్టాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులున్నాయా ? హైడ్రా పరిధిలో ఉందా ? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మంచిరేపుల గ్రామంలోని శ్రీఆదిత్య భవనాన్ని మూసీనదిని ఆక్రమించి నిర్మించినట్టు హైడ్రా తేల్చడంతో చాలా మంది కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. అందులోని ఫ్లాట్లను కొనుగోలు చేద్దామనుకున్నవారు వెనక్కి తగ్గారు. ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా కారణంగా రియల్ భూమ్ పెరిగిందనే చెప్పొచ్చు..తప్ప పడిపోలేదని అధికారులు చెబుతున్నారు.






