గోల్డ్ షాప్‌లో ఉద్యోగులే దొంగలుగా మారి చోరీ..

by Kodari Anjali |

జూబ్లీహిల్స్, రోడ్ నెం. 36 లోని ఎస్.కె.టి జ్యువెలర్స్ (పూర్వం విశిష్ట గోల్డ్ & డైమండ్స్) షాప్‌లో బంగారు ఆభరణాలను దొంగతనం కేసును జూబ్లీహిల్స్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.

గోల్డ్ షాప్‌లో ఉద్యోగులే దొంగలుగా మారి చోరీ..
X

దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్, రోడ్ నెం. 36 లోని ఎస్.కె.టి జ్యువెలర్స్ (పూర్వం విశిష్ట గోల్డ్ & డైమండ్స్) షాప్‌లో బంగారు ఆభరణాలను దొంగతనం కేసును జూబ్లీహిల్స్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ దొంగతనంలో ప్రమేయం ఉన్న ముగ్గురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్, ఎస్.కె.టి. జ్యువెలర్స్‌ లో గత ఏడాది జులై లో 38.020 గ్రాముల బంగారు ఆభరణం, ఈ ఏడాది మార్చి 25 న స్టాక్ తనిఖీలో 8.2 గ్రాముల బంగారు ఆభరణం, ఈ నెల జూన్ 10 న ఒక కస్టమర్ శాంపిల్ బంగారు గొలుసు సుమారు 30.14 గ్రాముల బరువున్న ఇతర బంగారు వస్తువులు కూడా కనిపించకుండా పోయాయి. విషయం యాజమాన్యానికి తెలుపడంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, కొంతమంది ఉద్యోగులు 1. భుక్య శివ కుమార్ (ఎ-1)2. వడ్డారం ప్రకాష్ (A-2), 3. పత్రి గోవర్ధన్ (ఎ-3) అనుమానాస్పదంగా కనిపించటంతో ఎస్.కె.టి. జ్యువెలర్స్ యజమాని అయిన దోసపాటి కార్తీక్ జూన్ 18 , గురువారం రోజున జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ సమీపంలో నిందితులు ముగ్గురు భుక్య శివ కుమార్, వడ్డారం ప్రకాష్, పత్రి గోవర్ధన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు సుమారు 76.385 గ్రాములు.. దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని ఆదిత్య హాల్‌మార్కింగ్ సెంటర్ ద్వారా వరంగల్ ప్రాంతంలోని కొందరు బంగారు వ్యాపారులకు విక్రయించినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించారు.

జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకు పోలీస్ వారి సూచనలు..

ప్రజలు తమ ఇళ్లలో పనిచేసే పనివాళ్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, సేల్స్‌పర్సన్‌లు మరియు ఇతర ఉద్యోగులను నియమించుకునే ముందు వారి గుర్తింపు, చిరునామా మరియు నేపథ్యాన్ని సరిచూసుకోవాలని సూచించారు. వారి గుర్తింపు పత్రాలు, ఫోటోలు మరియు సంప్రదింపు వివరాల కాపీలను భద్రపరచుకోండి మరియు సాధ్యమైన చోటల్లా పోలీసు వెరిఫికేషన్ పొందండి. వ్యాపార సంస్థలు , గృహాలు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని నిర్వహించాలి, క్రమం తప్పకుండా స్టాక్ తనిఖీలు నిర్వహించాలి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని వెంటనే పోలీసులకు నివేదించాలి. సరైన ధృవీకరణ, అప్రమత్తత దొంగతనాలు, ఇతర నేరాలను నివారించడంలో సహాయపడతాయి.

Next Story